టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్

by Disha Web Desk |
టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేట్ల మధ్య నువ్వా? నేనా? అన్నట్లుగా ఆధిపత్య పోరు సాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రారంభమైన పోరు నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ పోరుతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 కార్పొరేట్ స్థానాల్లో కేవలం 56 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విభేదాలకు చెక్ పెట్టేందుకు మంత్రులు సైతం ప్రయత్నం చేసినప్పటికీ విఫలం అయ్యారు. అన్నింటికీ ఆర్థిక లావాదేవీలు, ఆధిపత్యపోరేనని బహిరంగంగా విమర్శలు విపిస్తున్నాయి.

రాష్ట్రంలో, జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కార్పొరేటర్, ఎమ్మెల్యేల మధ్య పోరుమాత్రం సమసిపోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కార్పొరేటర్లు సహకరించలేదని ప్రధాన ఆరోపణ. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కార్పొరేటర్ అభ్యర్థులకు ఎమ్మెల్యేలు సహకరించకపోవడం, ఆధిపత్య పోరు సైతం ఉండటంతో ఇన్ చార్జులను పార్టీ సీనియర్లకు, ఎంపీ, మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ 56స్థానాల్లోనే విజయం సాధించింది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఓటమికి టీఆర్ఎస్2లోనే అనైక్యతే కారణమని భావించిన అధిష్టానం కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల మధ్య సయోధ్య బాధ్యతను గ్రేటర్ కు చెందిన మంత్రితో పాటు, మరో కీలకమంత్రికి బాధ్యతలను అప్పగించింది. పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ వారి వైఖరీలో మాత్రం మార్పురాలేదు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో సైతం అధికారపక్షం కార్పొరేటర్లే ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న సందర్భాలు ఉన్నాయి.

కుంటుపడుతున్న అభివృద్ధి...

ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్య విభేదాలతో టీఆర్ఎస్ గెలిచిన డివిజన్లలో అభివృద్ధి పనులు చేయడం లేదని ప్రజలు బహిరంగంగా పేర్కొంటున్నారు. ప్రతిపక్షాలకు చెందిన డివిజన్లలో అభివృద్ధి జరగడం లేదంటే ఆలోచించొచ్చు కానీ, అధికారపక్షంకు చెందిన డివిజన్లలో సైతం స్థానిక ఎమ్మెల్యేలు సహకరించకపోవడంతోనే జరుగడం లేదని కార్పొరేటర్లు సైతం ఆరోపిస్తున్నారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాల్లోనూ గ్రేటర్ లో పనుల ఆలస్యంపై పలువురు ఎమ్మెల్యేలు సైతం పేర్కొన్నారు. దీనికి ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్య విబేధాలే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆర్థిక లావాదేవీలు కారణమా?

డివిజన్లలో అభివృద్ధి పనులతో పాటు ఇళ్ల అనుమతుల విషయంలో కార్పొరేటర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు సైతం జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పలు విషయాల్లో ఇద్దరికి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు వస్తున్నట్లు సమాచారం. డివిజన్లలో ఎమ్మెల్యేల పెత్తనంపై పలువురు కార్పొరేటర్లు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. సమాచారం లేకుండా ఎమ్మెల్యేలు డివిజన్లలో పర్యటిస్తున్నారని ఇది తమకు అవమాన పర్చడమేనని ఆరోపణలు సైతం చేస్తున్నారు.

విభేదాలు కొనసాగితే నష్టమే...

గ్రేటర్ ఏపార్టీకైనా కీలకం. అయితే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ విభేదాలు తారాస్థాయికి చేరడం పార్టీకి తీవ్ర నష్టం కలిగించనుంది. ఇప్పటికే విభేదాలు గ్రేటర్ ఎన్నికల్లో నష్టం చేకూర్చిన విషయం తెలిసిందే. 99 సీట్లున్న టీఆర్ఎస్ 2019లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 56 స్థానాలకే పరిమితం అయింది. ఇప్పటికైనా అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో ఓటమిపాలయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed