బీజేపీ కుంభస్థలంపై గురి.. మళ్లీ ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్?

by Disha Web Desk 2 |
బీజేపీ కుంభస్థలంపై గురి.. మళ్లీ ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: 'నేను మళ్లీ ఢిల్లీ వచ్చి రాజకీయం చేస్తా.. కేంద్ర ప్రభుత్వ కుట్రలేందో. కథేందో చెప్పి వీళ్ల కుంభ స్థలాన్ని బద్దలు కొడతాం.. స్నేహితులు, శ్రేయోభిలాషులను సమీకరించి వీరి వ్యవహారమేంటో తెలుస్తాం.. రాష్ట్రపతి ఎన్నికల సమయం కూడా వచ్చింది. రైతుల అంశాన్ని ఎత్తుకున్నాం.. కేంద్రం న్యాయం చేసేవరకు విశ్రమించేది లేదు.. జాతీయ స్థాయిలో కలిసొచ్చే అన్నిపార్టీలు, రైతు, ప్రజా సంఘాలతో కలిసి పనిచేస్తాం.. భూకంపం సృష్టిస్తాం' = ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసన దీక్షలో సీఎం కేసీఆర్

హస్తినాకు మళ్లీ పయనమవుతున్నారు సీఎం కేసీఆర్. ఈ వారంలోనే వెళ్లనున్నట్లు సమాచారం. ఐదారు రోజులకు పైగా అక్కడే మకాం వేసి నేషనల్ పాలిటిక్స్, రైతు సమస్యలపై మేధావులు, రైతు సంఘాలతో చర్చించనున్నట్లు తెలిసింది. నల్లచట్టాలపై జరిగిన రైతు ఉద్యమంలో మృతిచెందిన రైతు కుటుంబాలను పరామర్శించడంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థికసాయం కూడా అందజేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే గులాబీ బాస్ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

జాతీయ రాజకీయాలపై ఇప్పటికే గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. పలువురి నేతలను సైతం కలిసిన ఆయన మరోమారు ఢిల్లీ వేదికగా సమావేశం అయ్యేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ వారంలో ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వారం రోజులపాటు అక్కడే ఉండి పలువురి సీఎంలతో భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం. రైతు సమస్యలతో పాటు జాతీయ రాజకీయాలను చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే తెలంగాణలో యాసంగింలో పండిన ధాన్యంమంతా కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో పాటు ఢిల్లీ వేదికగా నిరసనదీక్ష చేపట్టి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. అదే విధంగా దేశ రైతులకు ఒక సమగ్రమైన వ్యవసాయ విధానం లేక పోవడంతో సతమతమవుతున్నారని అంశాన్ని ఎత్తుకొని దేశ వ్యాప్తంగా ఆందోళనకు కార్యచరణ రూపొందిస్తున్నారు. కనీస మద్దతు ధరకు రాజ్యాంగ పరమైన రక్షణ ఇస్తూ రైతుల కోసం సమీకృత నూతన వ్యవసాయ విధానం(ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ) తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం. అన్ని రాష్ట్రాల రైతు ప్రతినిధులు, వ్యవసాయ చట్టాలపై ఉద్యమం చేపట్టిన రైతు సంఘాలు, ఎకనామిస్టులతో పాటు పలు రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్నారు. అందులో భాగంగా ప్రముఖ ఎకనామిస్టు అశోక్ గులాటీతో సమావేశం కానున్నట్లు సమాచారం. వారి అభిప్రాయాలను స్వీకరించి చేపట్టబోయే కార్యక్రమాలను ప్రణాళికలను రూపొందించనున్నారని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమబాట పట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆందోళనలో సుమారు 750 మందికి పైగా రైతులు మృతిచెందారు. ఆ కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ కేబినెట్ 22.5కోట్లు అందజేసేందుకు అంగీకారం తెలిపింది. చనిపోయిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు కూడా కేసీఆర్ ప్రకటించారు. దీనిపై కిసాన్ సంఘ్ నేత రాకేశ్ టికాయత్‌తో కూడా చర్చించారు. ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరీ జిల్లాలోని తికునియాలో గతేడాది అక్టోబర్ 3న శాంతియుతంగా నిరసన చేస్తున్న కర్షకులపై నుంచి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ వెళ్లడంతో నలుగురు రైతులు మృతి చెందగా, ఆందోళనలో 8 మంది రైతులు చనిపోయారు. ఆ కుటుంబాలను సైతం కేసీఆర్ పరామర్శించేందుకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మహారాష్ట్రలోని పూణేలో రైతు కుటుంబాలను, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి వెళ్లి రైతు నిరసనలో మృతిచెందిన రైతు కుటుంబాలను పరామర్శించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా రైతు కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున ఆర్థికసాయం కూడా అందించనున్నట్లు సమాచారం.

బీజేపీయే టార్గెట్‌గా..

కేంద్రంలోని బీజేపీయే టార్గెట్ కేసీఆర్ పావులు కదుపుతున్నారు. జాతీయ స్థాయిలో చేపట్టే ఉద్యమానికి బీజేపీయేతర సీఎంలతో పాటు రైతు, ప్రజాసంఘాలను ఏకం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్రం రైతులపై అవలంభిస్తున్న చర్యలను ఎండగడుతూనే మరో వైపు కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తున్న విషయాన్ని వివరించనున్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరించిన విధానం... టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోళ్లు... మద్దతు ధరపై సైతం అన్ని రాష్ట్రాల్లో వివరించే ప్రయత్నం చేయనున్నారు. ప్రధానంగా రైతు సమస్యలే ఎజెండాగా ముందుకు సాగనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ కేసీఆర్ ఎలా ముందుకు సాగుతారు... రాజకీయ వ్యూహం ఏమిటనేది చర్చనీయాంశమైంది. మరో వారంలో ఢిల్లీ వెళ్లనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story

Most Viewed