టీఆర్​ఎస్​లో గుబులు రేపుతున్నమోడీ సైలెంట్​

by Disha Web |
టీఆర్​ఎస్​లో గుబులు రేపుతున్నమోడీ సైలెంట్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పై మోడీ విమర్శలు చేస్తారని అందరూ భావించారు. కానీ టీఆర్ఎస్, కేసీఆర్ ప్రస్తావన లేకుండానే ప్రసంగాన్ని ముగించారు. ఇది రాజకీయ ఎత్తుగడలో భాగమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ మాత్రం మోడీ మౌనం వెనుక ఏదో జరుగనున్నదని భావిస్తుంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాష్ట్రానికి వచ్చిన రోజూ ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం, కేసీఆర్ మోడీ పాలనపై విరుచుకుపడటం, మోడీ మాత్రం తెలంగాణ గొప్పదనం గురించి మాత్రమే మాట్లాడటంతో ఏం జరుగుతుందోనని టీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటం, గత కొద్ది నెలలుగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యమాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ తరుణంలోనే రాష్ట్రపతి ఎన్నికలు రావడం, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసింది. అయితే విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలికింది. ఆయన గత నెల29వ తేదీన వస్తారని మొదట తేదీ ఖరారు అయినప్పటికీ టీఆర్ఎస్ వాయిదా వేయించినట్లు సమాచారం. అయితే ఈ నెల 2, 3 తేదీల్లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఉండటంతో దానిని పోటీగా ఈ నెల 2న రాష్ట్రపతి విపక్ష అభ్యర్ది యశ్వంత్ సిన్హాను టీఆర్ఎస్ వ్యూహాత్మంగా హైదరాబాద్ రప్పించింది. అంతేకాదు బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. కేసీఆర్ స్వయంగా యశ్వంత్ సిన్హాను ఆహ్వానించారు. అంతేకాదు జలవిహార్ సమావేశంలో మోదీ ప్రభుత్వం అనుసరించిన అంతర్జాతీయ విధానాలతో పాటు శ్రీలంకలో అదాని విద్యుత్ ప్రాజెక్టు విషయంలో మోదీపై వచ్చిన ఆరోపణలు మొదలు, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి ఆ దేశంలో మోడీ, హౌడీ అంటూ సభలు జరపడం వరకు కేసీఆర్ ప్రస్తావించి దేశం పరువు తీశారని మండిపడ్డారు.

గతంలో మోదీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వంపై చేసిన విమర్శలను గుర్తు చూస్తూ, రూపాయి విలువ ఇప్పుడు ఎందుకు పడిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ స్థాయిలో తొమ్మిది ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని, తాజాగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తీరును కేసీఆర్ ఆక్షేపించారు. మోడీపై 9 ప్రశ్నలు సంధించారు. అయితే పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించిన విజయసంకల్ప సభలో మాత్రం కేసీఆర్ సంధించిన ప్రశ్నలను మోడీ అసలు పట్టించుకోలేదు. తెలంగాణకు కేంద్రం రామగుండం ఎరువుల ప్యాక్టరీని పున: ప్రారంభించడం, 35వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం, రైల్వేల విస్తరణ కోసం రూ.3100కోట్లు ఇచ్చామని, 1080 కిలో మీటర్లు కొత్త రైల్వే లైన్లు వచ్చాయని, కరోనా సమయంలో ఆదుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఎక్కడ కూడా ప్రభుత్వ విధానాలను, కేసీఆర్ ను గానీ విమర్శించలేదు. అందుకు భిన్నంగా తెలంగాణ గొప్పదనం గురించి, ప్రజల పోరాట పటిమను వివరించారు. కనీసం కేసీఆర్ ఎక్కడ కూడా విమర్శించే అవకాశం లేకుండా చేశారు. దీంతో టీఆర్ఎస్ నేతలు డైలమాలో పడ్డారు.

జేపీ నడ్డా, అమిత్ షా, బండి సంజయ్ లు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కానీ మోడీ ప్రసంగించిన 27 నిమిషాల్లో కేసీఆర్ ప్రస్తావన రాలేదు. యశ్వంత్ సిన్హాతో టీఆర్ఎస్ సమావేశం నిర్వహించిన రోజే రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే కేసులో ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు చెందిన మధుకాన్ గ్రూప్ కంపెనీకి సంబంధించిన రూ.96.21కోట్ల ఆస్తులను జప్తీ చేసింది. ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సైతం తెలంగాణపై తీర్మానం చేసింది. అయితే సభలో మోడీ ఏం మాట్లాడకపోవడంతో ఏం చేస్తారో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికే కేసీఆర్​తో భేటీ అయినా నేతలందరిపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతుండటంతో టీఆర్ఎస్ నేతల్లో మరింత గుబులు మొదలైంది. మా పరిస్థితి ఏంటీ అనే సందిగ్ధంలో పడ్డారు. మోడీ ఏం చేస్తారోనని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆరా తీస్తున్నారు. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురు చూస్తున్నారు.

తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తుంది. టీఆర్ఎస్ నేతలంతా ఇక గ్రామాల బాటపట్టనున్నారు. ఒక వైపు విమర్శలు, మరో పక్క 8 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు సన్నద్ధమవుతున్నారు. దళితబంధు, రైతు బంధు, రైతు బీమా, ఇలా అన్ని సంక్షేమ పథకాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, నిర్మాణ మవుతున్న ప్రాజెక్టులను ప్రజలకు వివరించనున్నారు. ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించడంతోపాటు కేంద్రం తెలంగాణపై చూపుతున్న వివక్షను, గుజరాత్, యూపీ, బీజేపీ పాలిత రాష్ట్రాలకు సహకరిస్తున్న విధానం, నిధులు తదితరాలను వివరించి ప్రజలకు బీజేపీ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిపై దృష్టిసారించి ప్రజలకు తెలంగాణకు టీఆర్ఎస్ శ్రీరామరక్ష అని వివరించనున్నారు. ఏదీ ఏమైనప్పటికీ మోడీ సైలెంట్ తో గులాబీలో గబులు మొదలైందని చెప్పాలి.

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed