- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాధనం వృథా
చొప్పదండి మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృథా.. రూ.9.50 లక్షలతో కట్టిన పాత టాయిలెట్లను వాడుకలోకి తేకుండానే కూల్చేశారు.

దిశ, చొప్పదండి: పబ్లిక్ టాయిలెట్‌ల సౌకర్యం లేక పట్టణంతో పాటు మండల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంతంలో టాయిలెట్ల సౌకర్యం లేక బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం ద్వారా దుర్వాసనతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించడానికి పబ్లిక్ టాయిలెట్ లు ఎంతో దోహదపడతాయని ప్రభుత్వం భావించి స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ రూ.20 లక్షల నిధులను వెచ్చించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అత్యాధునిక పబ్లిక్ టాయిలెట్‌లను నిర్మాణం చేసింది. కాని వినియోగంలోకి తీసుకురాలేదు.
ఈ ప్రాంతంలో ప్రతి శుక్రవారం వారసంత, శనివారం పశువుల సంత నిర్వహణ జరుగుతుంది. సంతలో క్రయ విక్రయాల కోసం కోసం వచ్చే వ్యాపారులు, ప్రజలు కనీస సౌకర్యాలు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. సంతల వేలం ద్వారా లబ్ధిపొందుతున్న కాంట్రాక్టర్, లక్షల్లో ఆదాయం సమకూర్చుకుంటున్న మున్సిపాలిటీ ప్రజల సమస్యలు తీర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజా అవసరాల కోసం నిర్మాణం పూర్తి అయి నిరూపయోగంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్‌లను వినియోగంలోకి తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు.
రూ. 9.50 లక్షల నిధులు నీటిపాలు
2021 సంవత్సరంలో మున్సిపల్ అధికారులు ఇదే ప్రదేశంలో రూ. 9.50 లక్షల నిధులతో పబ్లిక్ టాయిలెట్ లు నిర్మించారు. నిర్మాణం చేసి నాలుగు సంవత్సరాలు ఎలాంటి వినియోగంలోకి తీసుకురాకుండా వాటిని కూల్చి వేసి 9.50 లక్షల నిధులను నీటిపాలు చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారుల నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని, ప్రజాధనాన్ని వినియోగించి ఇష్టారీతిగా పనులు చేపట్టడం తర్వాత వాటిని కూల్చడం ఇక్కడ అధికారులకే చెల్లుతొందన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. మున్సిపల్ నిధులతో ప్రజా టాయిలెట్స్ నిర్మాణం చేపట్టినప్పటికీ పూర్తిగా వినియోగంలోకి తేవడానికి ఎలాంటి చర్యలు తీసుకోక పోగా అర్ధాంతరంగా కనీస జీవన కాల పరిమితి ముగియకముందే స్క్రాప్ గా తొలగించి ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఇక్కడి అధికారులకే చెల్లింది.
పట్టణంలో ఏ పని ప్రారంభించిన అది ప్రజలకు ఉపయోగపడేలా చేయకుండా కాంట్రాక్టర్లకు, మున్సిపాలిటీకి సామగ్రి సప్లై చేసే కాంట్రాక్టర్ కు లాభం కలిగేలా మున్సిపాలిటీ వ్యవహరించిందని సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ప్రధాన కూడలి అయిన వారసంత, తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్ తదితర కార్యాలయాలకు వచ్చే ప్రజల కోసం అట్టహాసంగా నిర్మించిన మూత్రశాలలను పూర్తిగా వినియోగంలోకి తీసుకురాకుండానే చివరికి లక్షలాది రూపాయలతో నిర్మించిన కాంప్లెక్స్ ను జేసీబీ సహాయంతో తొలగించి చెత్త ట్రాక్టర్ల పై తరలించారు.
టాయిలెట్‌లను ప్రారంభిస్తాం
అత్యాధునిక పద్ధతులలో పబ్లిక్ టాయిలెట్‌లను నిర్మాణం చేశాం. ప్రజల అవసరాల కోసం టాయిలెట్ లను ప్రారంభించి వినియోగంలోకి తీసుకు వస్తాం.- కీర్తి నాగరాజు, మున్సిపల్ కమిషనర్ చొప్పదండి
- Tags
- Choppadandi






