పెత్తనమంతా ఆ పార్టీ వారిదే.. అందుకే రాజీనామా.. : టీఆర్ఎస్ సర్పంచ్

by Dishanational1 |
పెత్తనమంతా ఆ పార్టీ వారిదే.. అందుకే రాజీనామా.. : టీఆర్ఎస్ సర్పంచ్
X

దిశ, అశ్వారావుపేట: తమది అధికార పార్టీయా.. ప్రతిపక్ష పార్టీనో తెలియని అయోమయంలో ఉన్నామని అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన 11 మంది టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మూకుమ్మడి రాజీనామా చేస్తున్నట్టు విడుదల చేసిన లేఖ శనివారం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. పార్టీ బలోపేతానికి కృషి చేసే టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులను ప్రేక్షక పాత్రకే పరిమితం చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వ పథకాల మంజూరులో కనీస సమాచారం ప్రమేయం లేకుండానే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తున్నారని నాయకులు వాపోతున్నారు. ఇక తాము ప్రజాప్రతినిధులుగా ఉండి చేసేదేముందని తిరుమలకుంటకు చెందిన సర్పంచ్ సున్నం సరస్వతి, ఉప సర్పంచ్ జుజ్జురి రాంబాబు, ఎంపీటీసీ నారం నాగలక్ష్మి, వార్డు మెంబర్లు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇటీవల తిరుమలకుంట గ్రామంలో దళిత బంధు పథకం లబ్ధిదారుడిని ఎంపిక చేసినట్లు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని, అలానే ట్రైకార్ రుణాల మంజూరులో కూడా 15 మంది టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారని, వీరందరినీ కాదని మంజూరైన మూడు యూనిట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ వారికి కట్టబెట్టారని ఆందోళన చెందారు. స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్లు పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ పథకాల మంజూరులో కీలకంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి అవమానకర పరిస్థితుల్లో పేరుకే ప్రజా ప్రతినిధులు కొనసాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కోసం శ్రమించి మద్దతిచ్చిన వ్యక్తులు, కార్యకర్తలను నిలదీస్తున్నారని పలువురు తెలిపారు. వారికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్న లేఖను టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బోల్లికొండ చెన్నారావుకు సమర్పించారు.

పార్టీ గ్రామ అధ్యక్షుడి వివరణ

తిరుమలకుంట గ్రామపంచాయతీకి చెందిన 11 మంది టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా లేఖ సమర్పించిన మాట వాస్తవమేనని, ఇదే విషయాన్ని మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, అసంతృప్తితో ఉన్న ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు పార్టీ గ్రామ అధ్యక్షుడు బోల్లికొండ చెన్నారావు తెలిపారు.

Next Story

Most Viewed