- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వోచర్ ఇచ్చారు.. నగదు మాయం చేశారు!
మహిళా సంఘాల సభ్యులను ఓ మినీ బ్యాంకు నిర్వాహకురాలు నిలువునా ముంచిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

దిశ, నర్సంపేట: మహిళా సంఘాల సభ్యులను ఓ మినీ బ్యాంకు నిర్వాహకురాలు నిలువునా ముంచిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నెల నెలా స్థానిక మినీ బ్యాంకులో చెల్లించే పొదుపు, అప్పులు, వడ్డీ డబ్బు మూకుమ్మడిగా బ్యాంకు స్టేట్మెంట్ లో కనపడకపోవడం బాధిత మహిళలను ఆందోళనకు గురి చేసింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు రూ.30-40 లక్షలు కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకుంటున్న మహిళా సంఘాల సంఖ్య రోజురోజుకూ పెరగడం, అందులో డబ్బులు మాయమవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
మోసం జరిగిందిలా..!
నర్సంపేట మండలంలోని ముగ్ధూంపురం గ్రామంలో విఘ్నేశ్వర, రాజేశ్వరి, బంజారా అనే మూడు వీవోలు ఉన్నాయి. వీటి పరిధిలో 80 మహిళా సంఘాలు పనిచేస్తున్నాయి. గతేడాది అక్టోబర్ వరకు ఐకేపీ కింద పని చేశాయి. అనంతరం నర్సంపేట మున్సిపాలిటీ పరిధి పెరగడంతో మున్సిపల్ పరిధిలోని వెళ్లాయి. దీంతో మెప్మా కిందకి వెళ్లాయి. ప్రస్తుతం 11,12 వార్డుల్లో సంఘాలు ఉన్నాయి. చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన ఎస్బీఐ వీరి దత్తత బ్యాంకు. ఈ క్రమంలో ముగ్ధూంపురంలో స్థానికంగా పని చేస్తున్న ఎస్బీఐ మినీ బ్యాంకులో నగదు లావాదేవీలు చేసుకోవాలని బ్యాంకు అధికారులు సైతం పలుమార్లు మహిళా సంఘాలకు చెప్పడంతో స్థానికంగా నెలనెలా పొదుపులు, అప్పులు, వడ్డీలు కడుతూ వస్తున్నారు.
ప్రతి నెల 5, 10వ తేదీకి మినీ బ్యాంకులో నగదు జమ చేసి 20వ తేదీన వీవో సంఘం మీటింగ్ లో జమచేసిన వోచర్ ని అందజేస్తారు. ఒక్కో బ్యాంకును బట్టి జమ చేసే నగదు పరిమితి రూ.30 నుంచి రూ. 49వేల వరకు ఉంటుంది. ఈ క్రమంలో మినీ బ్యాంకుకు వెళ్లి నగదు జమ చేసే వారికి కంప్యూటర్ రసీదు కాకుండా, వోచర్ మీద సంతకం, ముద్ర వేసి ఇస్తున్నట్లు తెలుస్తోంది. గత నాలుగు ఏండ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఉదాహరణకు రూ. 50వేలు జమ చేసిన మహిళా సంఘానికి వోచర్ రూ.50 వేలకు ఇస్తూ, బ్యాంకుకు మాత్రం రూ.10-30 వేలు మాత్రమే చెల్లిస్తూ వస్తున్నట్లు స్టేట్మెంట్ తో స్పష్టం అవుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఏళ్లుగా ఇదే తంతు జరుగుతున్నట్లు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
రుణం కోసం పోతే మోసం బయటికి..
ముగ్ధూంపురం గ్రామానికి చెందిన ఝాన్సీ గ్రూప్ సభ్యులు పావలా వడ్డీ కింద రూ.10 లక్షల రుణం కోసం ఇటీవల చెన్నారావుపేట ఎస్బీఐకి వెళ్లారు. సంఘం చెల్లింపులు చెక్ చేయడంతో సరిగా కట్టడం లేదని గుర్తించిన మేనేజర్ వీరికి రుణం అందించడానికి నిరాకరించారు. దీంతో కంగుతిన్న సంఘ సభ్యులు తాము ప్రతి నెలా కడుతున్నట్టు మొరపెట్టుకున్నారు. తమ దగ్గర ఉన్న రసీదులు, బుక్స్ లో నమోదు చేసిన వివరాలు అందజేశారు. ఈ వివరాలను బ్యాంకు స్టేట్మెంట్ తో పోల్చడంతో రూ. 80 వేల వరకు తేడా రావడం గమనించారు. ఇది గమనించిన మరి కొన్ని మహిళా సంఘాలు బ్యాంకులో తమ గ్రూపు స్టేట్మెంట్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందటి వరకు దాదాపు ఆరు గ్రూపుల్లో రూ.3లక్షల వరకు నగదు పక్కదారి పట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ నోటా ఈ నోటా అన్ని సంఘాలకు తెలియడంతో ఒక్కొక్కరిగా స్టేట్మెంట్ కోసం బ్యాంకుకు క్యూ కడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఓ ఇంటి దగ్గర సీఏ ఆధ్వర్యంలో మూడు గ్రూపులకు ఆడిట్ నిర్వహించగా రెండు గ్రూపుల్లో నగదు తేడా వచ్చినట్లు తెలిసింది.
లక్షల్లో నగదు పక్కదారి..!
ముగ్ధూంపురంలో మహిళా సంఘాలు జమ చేస్తున్న నగదు లక్షల్లో పక్కదారి పట్టినట్లు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.30-40 లక్షలు కాజేసినట్లు చర్చ జరుగుతోంది. మూడు వీవో పరిధిలోని 80 గ్రూపుల్లో బంజారా వీవో సంఘాల్లో ఫ్రాడ్ తక్కువ జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఈ సంఘ సభ్యులు దాదాపుగా కంప్యూటర్ రసీదు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. గతంలో ఓసారి జరిగిన పొరపాటుతో గత రెండేళ్లుగా ఆన్లైన్ రసీదు మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మిగతా 50 గ్రూపులు మాత్రం వోచర్ రసీదు మాత్రమే తీసుకుంటున్నారు.
పర్యవేక్షణ లేదు.. పట్టుబడినా చర్చల్లేవ్..
గతేడాది వరకు ఐకేపీ ఆధ్వర్యంలో నడిచిన ఈ మూడు విఘ్నేశ్వర, రాజేశ్వరి, బంజారా వీవోలు ఏడు నెలలుగా మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ సంఘాలపై సరైన పర్యవేక్షణ మొదటి నుంచి లేనట్లు తెలుస్తోంది. నాలుగేళ్లుగా సరైన ఆడిటింగ్ లేదని సభ్యులు ఆరోపించారు. మెప్మా పరిధిలో వచ్చాక సైతం కనీస పర్యవేక్షణ సైతం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. వీరిని మానిటర్ చేయాల్సిన ఏడీఎంసీ పోస్టు ఖాళీగా ఉండటం విమర్శలకు కారణం అవుతుంది. కనీసం ఇన్చార్జీగా అయినా ఎవరికో ఒకరికి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ మోసాలకు కారణం అవుతుంది. మరోవైపు మినీ బ్యాంకుల ఏర్పాటుతో బ్యాంకు సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశించినప్పటికీ నిరాశే ఎదురవుతోంది. ఈ సర్వీస్ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడటం కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది.






