అంతా ఒక్కటై.. అవ్వ ప్రాణాలను నిలిపిన సర్పంచ్, గ్రామస్తులు

by Disha Web Desk |
అంతా ఒక్కటై.. అవ్వ ప్రాణాలను నిలిపిన సర్పంచ్, గ్రామస్తులు
X

దిశ, మల్లాపూర్: రక్త సంబంధీకులు కష్టంలో ఉన్నారంటేనే పట్టించుకోని నేటి రోజుల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న ఓ వృద్ధురాలిని కాపాడి ఆదర్శంగా నిలిచారు గ్రామస్తులు. సర్పంచ్ చొరవ.. గ్రామస్తుల ఉదారత.. వెరసి ఓ నిండి ప్రాణం నిలిచింది. ఆపదలో ఐకమత్యాన్ని చాటుకున్న కుస్తాపూర్ గ్రామస్తులపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకూ ఏం జరిగిందంటే..

మల్లాపూర్ మండలంలోని కుస్తాపూర్ గ్రామానికి చెందిన మండోజి లసుంబాయి (80)పై ఈనెల 13న పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆ దాడిలో లసుంబాయి ముఖం ఛిద్రమై పరిస్థితి విషమంగా మారింది. మెట్ పల్లి ఆస్పత్రి వైద్యులు హైదరాబాద్‌ తరలించాలని సూచించడంతో కుటుంబ సభ్యులు తన నిస్సాయతను గ్రామ సర్పంచ్ సరికెల లక్ష్మీ-మహిపల్ వద్ద వెల్లడించారు. తాము అంత ఖర్చు భరించలేమని విలపించారు. వెంటనే స్పందించిన సర్పంచ్ సరికెల లక్ష్మీ-మహిపల్ బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఛిద్రమైన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని.. అందుకు అయ్యే ఖర్చు తాము భరిస్తామని హామీ ఇచ్చారు.




మరోవైపు లసుంబాయి దీనస్థితిని చూసి తల్లడిల్లిన సర్పంచ్.. గ్రామంలో యువత, పెద్దలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని కోరారు. ఆమె విజ్ఞప్తి మేరకు దుబాయ్ సేవా సమితి రూ.10వేలు, మాజీ ఎంపీటీసీ సరోజన రూ.10వేలు, మండోజి సంతోష్ రూ.5వేలు, గ్రామంలోని యువత మరికొన్ని విరాళాలను సేకరించి అందించారు. ఆ విరాళాలతోపాటు మిగతా ఖర్చులను సర్పంచ్ సరికెల లక్ష్మీ-మహిపల్ భరించారు. ప్రస్తుతం లసుంబాయి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడింది. ఆమెకు వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేసి ముఖాన్ని మళ్లీ యథా స్థితికి తీసుకువచ్చారు. లసుంబాయి ప్రాణాలను కాపాడిన సర్పంచ్, గ్రామస్తులను జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.




Next Story

Most Viewed