ఎఫ్ఆర్ఐలో పేరు తొలగిస్తామని మహిళను రైల్వే స్టేషన్‌కు పిలిచి..

by Disha Web Desk |
ఎఫ్ఆర్ఐలో పేరు తొలగిస్తామని మహిళను రైల్వే స్టేషన్‌కు పిలిచి..
X

దిశ,భువనగిరి రూరల్ : మేము పోలీసులం.. మీ పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగిస్తాం.. రూ. 2లక్షలు ఇవ్వండి.. అంటూ ఫోన్ చేసిన ఇద్దరు నకిలీ పోలీసుల వలలో చిక్కిన ఓ మహిళ దారుణంగా మోసపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిందీ ఘటన. డీసీపీ నారాయణ రెడ్డి తెలిసిన వివరాల ప్రకారం..

ఉప్పల్‌కు చెందిన పసల జ్యోతి, ఆమె బంధువులపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కొంత కాలం క్రితం ఫోర్జరీ కేసు నమోదైంది. అయితే వారి పేర్లను ఎఫ్ఆర్ఐ నుంచి తొలగిస్తామని ఇద్దరు యువకులు ఫోన్‌ చేశారు. దీనికి అంగీకరించిన వారితో రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా బాధితురాలు యువకులకు లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు యువకులు మళ్లీ బాధితులకు కాల్ చేసి ఎఫ్ఐఆర్ లో పేర్లు తొలగించామని, మిగిలిన డబ్బులు ఇవ్వాలని కోరారు. అయితే పేర్లు తొలగించినట్లు డాక్యుమెంట్ చూపించాలని బాధితులు అడగగా.. భువనగిరి రైల్వే స్టేషన్ వద్దకు వచ్చి డాక్యుమెంట్ తీసుకొవాలని చెప్పారు. రైల్వే స్టేషన్ వద్దకు వచ్చిన బాధితురాలిని ఇద్దరు యువకులు డమ్మీ తుపాకులతో ఆమెను బెదిరించి డబ్బులు తీసుకుని యాదగిరిగుట్టకు పారిపోయారు.

ఆమె ఫిర్యాదుతో కుసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు విచారణ చేపట్టగా నిందితులు అడ్డగుడూరు మండలానికి చెందిన విజయ్, యాదగిరిగుట్టకు చెందిన సాయి తేజగా గుర్తించారు. దోపిడీ అనంతరం ఇద్దరు సాయి తేజ ఇంట్లో తలదాచున్న విషయం తెలుసుకున్న పోలీసులు వారిని గురువారం అరెస్ట్ చేసి, చీటింగ్ కేసు నమోదు చేసినట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 2 డమ్మీ గన్స్, 2 సెల్ ఫోన్స్, 2 ద్విచక్ర వాహనాలు, ఐడీ కార్డులు, కంఫార్మషన్ లెటర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో ఈ యువకులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఐదుగురు వద్ద నుంచి నగదు వసూలు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వారి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరుపరిచినట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed