RGUKT Basara IIIT: ట్రిపుల్ ఐటీ టెన్షన్ టెన్షన్.. మంత్రి వ్యాఖ్యలపై విద్యార్థుల ఆగ్రహం

by Javid Pasha |
RGUKT Basara IIIT students Continue Their protest against minister sabitha indra reddy words
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: RGUKT Basara IIIT students Continue Their protest against minister sabitha indra reddy words| నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మూడవ రోజు తరగతి గదులను బహిష్కరించి.. కళాశాల ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. సిల్లీ డిమాండ్స్ అన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి కామెంట్లపై ఆర్జీయూకేటీ విద్యార్థులు ఫైరయ్యారు. మీలాగా పూటకో పార్టీ మార్చినట్టు మేము కాలేజీలు మారమని మంత్రిపై విద్యార్థులు సెటైర్ వేశారు. కలెక్టర్ హామీ ఇచ్చినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. ట్రిపుల్ ఐటీకి డైరెక్టరు నియామకం చేయగా.. దీనిని స్వాగతిస్తున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించమని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు.

గత మూడు రోజులుగా 8000 మంది విద్యార్థులు ఆకలి దప్పికలు మాని అటు ఎండలో ఇటు వర్షంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆందోళన చేస్తుంటే సీఎం కేసీఆర్ స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతుంటే అధికారులు అసలు ఇది సమస్యే కాదు అన్నట్టు.. 8000 మంది విద్యార్థుల భవితవ్యంపై సిల్లీగా మాట్లాడి మాకు కావాల్సిన డిమాండ్లను వాళ్ళు సిల్లీ అనడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''హైదరాబాద్‌లో ఉండి మాట్లాడటం కాదు.. ఇక్కడికి వచ్చి చూడాలి'' అంటూ వ్యాఖ్యలు చేశారు. వెంటనే మా సమస్యలను పరిగణలోకి తీసుకుని మాకు మా డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నామని విద్యార్థులు అన్నారు. జిల్లా కలెక్టర్ తీరు బాగోలేదని, చర్చలకు పిలిచి బెదిరించారని విద్యార్థులు తెలిపారు.

తమ సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై నిర్బంధకాండ కొనసాగుతోందని వారు అన్నారు. విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. రెండ్రోజులుగా విద్యార్థులు ఆందోళనలు తీవ్రం చేయడంతో మూడో రోజు గురువారం పోలీసు అధికారులు మరింత పకడ్బందీ విధానాలు అవలంభించారు. సగం మంది విద్యార్థులను హాస్టల్ గదుల నుంచి బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మరో సగం మంది వివిధ మార్గాల్లో వర్సిటీ ప్రవేశ మార్గంలోని గేటు వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించి మూడో రోజు ఆందోళనలు ప్రారంభించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారికి తాగునీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో నీరు లేక విద్యార్థులు ఇబ్బందులకు లోనవుతున్నారు. తమపై ఒత్తిడి తెస్తున్నారని స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''మా క్యాంపస్ ఎస్పీ కంట్రోల్‌లో ఉంది. తాగునీరు, విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించాలి'' అని విద్యార్థులు ట్వీట్ చేశారు.

విద్యార్థులను నిర్భంధకాండలో కొనసాగించి ఆందోళనలను విరమింపజేసే దిశగా ప్రభుత్వం, పోలీసులు పకడ్బందీ వ్యూహాలతో వ్యవహారిస్తున్నారు. అయితే విద్యార్థులు సైతం పట్టు వదలని ధీమాతో సమస్యలను పరిష్కరించుకునేంత వరకు డిమాండ్లను నేరవేర్చే వరకు ఆందోళనలు విరమించేది లేదని ధర్నాను కొనసాగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ గురువారం నుంచి తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించినా.. ఒక్క తరగతి కూడా జరగకపోవడం విశేషం. విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి కేసులు పెడతామని భయాందోళనకు గురి చేసి ధర్నా విరమింపజేసేందుకు చర్యలు చేపట్టడం సిగ్గు చేటని రాజకీయ పార్టీల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. విద్యార్థులు గేటు వైపు దూసుకు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి.. బారికేడ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు గేటు లోపల ఆందోళన చేస్తుండగా.. బయట ఉన్న తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులకు మద్దతుగా వచ్చిన వివిధ పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

ట్రిపుల్ ఐటీకి నూతన డైరెక్టర్‌

బాసర ట్రిపుల్ ఐటీ వద్ద మూడో రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగింది. విద్యార్థుల నిరసనల మధ్యే ట్రిపుల్ ఐటీకి నూతన డైరెక్టర్‌‌ను ప్రభుత్వం నియమించింది. ప్రొఫెసర్ సతీష్ కుమార్‌ను యూనివర్సిటీ నూతన డైరెక్టరుగా నియామకం చేస్తూ.. గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్ నియామకం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కాగా తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని వెల్లడించారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.

Next Story

Most Viewed