'జీవో' రగడ.. మంత్రి సబిత 'యూటర్న్‌'తో సరికొత్త వివాదం!

by Disha Web Desk 19 |
జీవో రగడ.. మంత్రి సబిత యూటర్న్‌తో సరికొత్త వివాదం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీచర్లు ఆస్తులు కొన్నా, అమ్మినా వివరాలు సమర్పించాల్సిందేనని తొలుత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంలో ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఇతర శాఖల ఉద్యోగులకు కాకుండా కేవలం ఉపాధ్యాయులపై మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వచ్చింది. దీంతో ఏకంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలుగజేసుకుంది. ఉత్తర్వులు ఇచ్చి కనీసం 24 గంటలు కూడా గడువక ముందే బ్యాక్​స్టెప్​తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సబిత ఇంద్రారెడ్డి యూటర్న్​తీసుకోవాలని చెప్పడంతో ఇప్పుడు సరికొత్త వివాదం చెలరేగింది. ఈ అంశంపై అధికారుల స్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై సర్కార్‌ వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు, యూనిఫాం ఇవ్వకపోవడం, మన ఊరు-మన బడిపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు ఆస్తుల వివరాల అంశం ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చినట్లయింది. వెంటనే మంత్రి ఆ సర్క్యులర్​పై తాత్కాలిక సస్పెన్షన్​విధించాలని ఆదేశించారు. అయితే తాము నిబంధనలకు లోబడే ఈ ఉత్తర్వులు విడుదల చేశామనే కాన్ఫిడెన్స్‌లో ఉండగా మంత్రి తీసుకున్న నిర్ణయంపై డీలా పడినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం నడుచుకునేందుకు కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తోందనే భావనలో అధికారులున్నారు. మంత్రి ఆదేశాలు కావడంతో ఈ అంశంపై ఏ అధికారి కూడా నోరు మెదిపే సాహసం చేయడంలేదు. ఇదిలా ఉండగా ఈ సర్క్యులర్ తీసుకొచ్చిన అధికారులపై భవిష్యత్‌లో ఎలాంటి చర్యలుంటాయోననే ఆందోళన పలువురిలో వ్యక్తమవుతోంది.



Next Story