- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు కష్టానికి కనిపించని శత్రువు 'నకిలీ'
ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతన్నకు ఏదో రకంగా నష్టాలే మిగులుతున్నాయి.

ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతన్నకు ఏదో రకంగా నష్టాలే మిగులుతున్నాయి. సీజన్ వచ్చిందంటే చాలు అన్నదాతలు విత్తనాలు కొనుగోలు చేసి వ్యవసాయాన్ని ప్రారంభిద్దామని కలలు కంటారు. కానీ అమాయక రైతులను మోసపుచ్చి లాభాలు గడించాలని వ్యాపారులు అదును కోసం వేచి చూస్తుంటారు. అమాయక రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని, కొన్ని ముఠాలు నకిలీ మరియు నాసిరకం విత్తనాలను మార్కెట్లోకి వదులుతూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నాయి. విత్తనం నాణ్యంగా ఉంటేనే రైతు ఆశలు పంటగా మారతాయి. కానీ విత్తనం దశలోనే మోసపోతే రైతు పెట్టుబడి, శ్రమ, సమయం మొత్తం వృథా అవుతుంది. గతంలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయిన ఘటనలు జరిగినప్పటికీ, వాటి మూలాలను గుర్తించి పూర్తిగా అరికట్టడంలో యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -దిశ, మేళ్లచెరువు
దిశ, మేళ్లచెరువు : మేళ్లచెరువు మండలంలో వాణిజ్య పంటల సాగు పెరుగుతున్న కొద్దీ నకిలీ విత్తనాల బెడద కూడా రైతాంగాన్ని వెంటాడుతోంది. విత్తనం నాణ్యంగా ఉంటేనే రైతు ఆశలు పంటగా మారతాయి. కానీ విత్తనం దశలోనే మోసపోతే రైతు పెట్టుబడి, శ్రమ, సమయం మొత్తం వృథా అవుతుంది. గతంలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయిన ఘటనలు జరిగినప్పటికీ, వాటి మూలాలను గుర్తించి పూర్తిగా అరికట్టడంలో యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట ఎందుకు పడడం లేదు..?
ప్రతి వ్యవసాయ సీజన్‌కు ముందు నకిలీ విత్తనాలపై హెచ్చరికలు వినిపిస్తాయి. అధికారులు తనిఖీలు చేస్తున్నామని చెబుతారు. కానీ గ్రామస్థాయిలో దళారులు మాత్రం యథేచ్ఛగా తిరుగుతూ రైతులకు విత్తనాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతున్నాయంటే వాటి వెనుక ఉన్న నెట్వర్క్‌ను గుర్తించడం ఎందుకు సాధ్యం కావడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది.
పంట వేసేది ఇక్కడ... బాధ్యత ఎవరిది..?
మండలంలోని రైతులు గుంటూరు, పిడుగురాళ్ల, దాచేపల్లి, రెంటచింతల ప్రాంతాల నుంచి విత్తనాలు కొనుగోలు చేయడం సాధారణంగా మారింది. తక్కువ ధర, ఎక్కువ దిగుబడి అనే ఆశతో రైతులు ఆకర్షితులవుతున్నారు. అయితే పంట విఫలమైతే ఆ విత్తనం ఎవరిది? ఎక్కడ కొనుగోలు చేశారు? అనే ప్రశ్నలకు సమాధానాలు లేక రైతులు నష్టపోతున్నారు.
అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమా..?
నకిలీ విత్తనాల సమస్యలో రైతుల అవగాహన లోపం కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్యాకెట్‌పై ఉండాల్సిన వివరాలు, ధృవీకరణ గుర్తులు, బిల్లు తీసుకోవాల్సిన అవసరం వంటి అంశాలపై చాలామందికి పూర్తి అవగాహన లేదు. గ్రామసభలు, రైతు వేదికల ద్వారా ఈ సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖపై ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో కార్యక్రమాలు కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు.
గత ఘటనల నుంచి పాఠాలు నేర్చుకున్నామా..?
గత ఏడాది మిర్చి పంటలో పూత, పిందెలు రాక పలువురు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో ఆందోళనలు జరిగినా సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించలేదు. ఒకే రకమైన ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
చర్యలు కాకుండా నివారణే ముఖ్యం
నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కేసులు నమోదు చేయడం కంటే ముందే రైతులకు సరైన అవగాహన కల్పించడం, గుర్తింపు పొందిన డీలర్ల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించడం, సీజన్ ప్రారంభానికి ముందే తనిఖీలు నిర్వహించడం వంటి చర్యలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.
అధికారుల ముందున్న సవాల్
ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా చూడటం వ్యవసాయ శాఖకు పెద్ద సవాల్‌గా మారింది. గ్రామాల వారీగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ఆకస్మిక తనిఖీలు, దళారులపై కఠిన చర్యలు చేపట్టినప్పుడే రైతులకు భరోసా కలుగుతుందని రైతాంగం కోరుతోంది. లేకపోతే ప్రతి ఏడాది మాదిరిగానే నష్టాల కథలు పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






