సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్.. ఆ వివరాలు ఇవ్వాలని హైకోర్టు నోటీస్

by Disha Web Desk 19 |
సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్.. ఆ వివరాలు ఇవ్వాలని హైకోర్టు నోటీస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో టీఆర్ఎస్‌కు భూమి కేటాయింపుపై గురువారం హైకోర్టులో విచారణ చేపట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలకు భూమి గజానికి రూ.100చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ విశ్రాంత ఉద్యోగి మహేశ్వర్ రాజ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. బంజారాహిల్స్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీకి స్థలం కేటాయింపుపై వివరాలివ్వాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డికి, సీఎస్, సీసీఎల్ఏ, హైదరాబాద్ కలెక్టర్‌కు సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

టీఆర్ఎస్‌కు రాష్ట్ర ప్రభుత్వం బంజారాహిల్స్‌లో కారుచౌకగా భూమి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ విశ్రాంత ఉద్యోగి కె.మహేశ్వర్‌ రాజ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. 2018లో ప్రభుత్వం గుర్తింపు పొందిన పార్టీలకు జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలకు గజానికి రూ.100 చొప్పున ఎకరం స్థలం కేటాయించేలా జీవో జారీ చేసింది. ఈ ఏడాది మే 11న బంజారాహిల్స్‌లో టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం గజానికి రూ.100 చొప్పున 4,935 గజాలను రూ.4,93,500లకు ప్రభుత్వం కేటాయించింది. మార్కెట్‌ ధర ప్రకారం దీని విలువ గజానికి రూ.2 లక్షలకు పైగా ఉంది. మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుంది.

అదే విధంగా రాష్ట్రంలోని 32 జిల్లాకేంద్రాల్లో కూడా రూ.100 చొప్పున ఎకరం స్థలం పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి కేటాయించారు. ఇది చట్ట విరుద్ధమని, ఈ స్థలం కేటాయింపులో సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లఘించినట్లు స్పష్టమైంది. అంతేగాకుండా 2005లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయించింది. ఈ స్థలం కూడా సమీపంలోనే ఉండటం, ఆ ఎకరం స్థలంలో పార్టీ కార్యాలయంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా చానెల్‌ను కూడా నిర్వహిస్తున్నారని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు హైదరాబాద్‌లో స్థలం లేదంటున్న ప్రభుత్వం పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయించడం ఏకపక్ష నిర్ణయం అని కోర్టుకు వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ఈ కేసులో ఏం తీర్పు వెలువడుతుందోనని రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది.


Next Story

Most Viewed