మహిళా భద్రతకు పెద్దపీట వేసిన రాష్ట్రం తెలంగాణ: మంత్రి

by Dishafeatures2 |
మహిళా భద్రతకు పెద్దపీట వేసిన రాష్ట్రం తెలంగాణ: మంత్రి
X

దిశ, చౌటుప్పల్: దేశంలో మహిళల భద్రతకు పెద్దపీట వేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా పక్షపాతి అని ఆయన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక ప్రభుత్వ పథకాలను ప్రవేశ పెట్టారని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కులను సాధించుకున్న రోజుగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలియజేశారు. మహిళలు స్వేచ్ఛగా బతకాలని ఆర్థికంగా, విద్యాపరంగా వారిలో ఆత్మవిశ్వాసం నెలకొల్పాలనే పద్ధతుల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మహిళా భద్రత చాలా ఇబ్బందికరంగా ఉండేదని, కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే పోకిరీల ఆగడాల నుండి మహిళలను రక్షించాలనే ఉద్దేశంతో షీ టీమ్స్ ప్రవేశ పెట్టారని తెలిపారు. అత్యున్నత స్థాయిలో ఉన్న మహిళా ఐపీఎస్ లతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి వారి ఇబ్బందులను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.

దేశంలోనే అత్యధిక మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా మహిళల పేరు మీదనే తీసుకొచ్చిన గొప్ప మనసున్న వ్యక్తి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఏ మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేయకుండా కేసీఆర్ గొప్ప ఆలోచనతో కల్యాణలక్ష్మి పథకం తీసుకువచ్చారని తెలిపారు. పెళ్లిళ్లకు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎక్కువగా ఉండడంతోనే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశ పెట్టారని అన్నారు. ఆడపిల్ల పెళ్లి భారంగా మారకూడదనే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అందిస్తున్నామని తెలిపారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళలకు మంత్రి జగదీశ్ రెడ్డి శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, ఆర్డిఓ సూరజ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, పిఎసిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ దశరధ నాయక్, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed