Telangana :దూకుడు పెంచనున్న గవర్నర్.. భరోసా ఇచ్చిన ప్రధాని, హోం మంత్రి?

by Disha Web Desk 2 |
Telangana :దూకుడు పెంచనున్న గవర్నర్.. భరోసా ఇచ్చిన ప్రధాని, హోం మంత్రి?
X

ఢిల్లీ వెళ్లొచ్చిన గవర్నర్ మరింత దూకుడు పెంచనున్నారా..? తన విశేషాధికారాలన్నీ ఉపయోగించుకోనున్నారా..? ప్రతి ఫైలును జాగ్రత్తగా పరిశీలించిన మీదటే సంతకం చేయనున్నారా..? అంటే అవుననే అనిపిస్తున్నది. ఇటు రాజకీయ పరంగా.. అటు రాజ్యాంగపరంగా టీఆర్ఎస్ సర్కారును ఇరుకున పెట్టేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు కేంద్ర సర్కారు సిద్ధమైంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యాచారణ మొదలయ్యే అవకాశం ఉన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంపై బీజేపీ మరింత దూకుడు వైఖరిని ప్రదర్శించాలనుకుంటున్నది. అధికార పార్టీ టీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటున్నది. పవర్‌లోకి రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే భావనతో ద్విముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నది. ఒకవైపు రాజకీయంగా మరోవైపు రాజ్యాంగపరంగా టీఆర్ఎస్‌ను కార్నర్ చేయాలన్నది బీజేపీ టార్గెట్. క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేస్తూ టీఆర్ఎస్ అవినీతిని ఎండగట్టడం పార్టీపరంగా అవలంబించనున్న వ్యూహం. ప్రభుత్వ పరంగా రాజ్‌భవన్‌తో పెరుగుతున్న వైరం, రాజ్యాంగ ఉల్లంఘనలు, ప్రోటోకాల్ వైఫల్యాలతో గవర్నర్ ద్వారా సర్కారును ఊపిరి సలపకుండా చేయడం ఆ వ్యూహంలో రెండో పార్శ్వం. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లతో తాజాగా భేటీ అయిన తర్వాత గవర్నర్ చేసిన వ్యాఖ్యలు రానున్న కాలంలో ఊహించని కార్యాచరణకు దారితీస్తుందన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. రాజ్యాంగ ఉల్లంఘనలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి అంశాల్లో రాజీ పడొద్దని గవర్నర్‌కు వారిద్దరూ స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరించాలంటూ ఆమెకు ఫ్రీ హాండ్ ఇచ్చినట్లు సమాచారం. ఇకపైన క్రమం తప్పకుండా రిపోర్టును సమర్పించాలనీ ఆమెకు సూచించారు. కేంద్రం నుంచి అందిన ప్రోత్సాహంతో ఇకపైన ప్రభుత్వం తీసుకునే ప్రతి విధాన నిర్ణయాన్ని గవర్నర్ లోతుగా సమీక్షించే అవకాశం ఉన్నది.

ఆగ్రహం కలిగించిన ప్రివిలెజ్ మోషన్

రాష్ట్ర విభజనపై అప్పటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల ఇటీవల రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యలు చేయడం, దానిపైన టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలెజ్ మోషన్ దాఖలు చేయడం బీజేపీ అగ్ర నాయకత్వానికి ఆగ్రహం కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోడానికి కేంద్రంపై ఆరోపణలు చేయడం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను టార్గెట్ చేసి ఆయనపైనా ప్రివిలెజ్ మోషన్ ప్రవేశపెట్టడాన్నీ సీరియస్‌గానే తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ తప్పులను పార్టీపరంగా, ప్రభుత్వపరంగా బహిర్గతం చేస్తూ ప్రజల్లో టీఆర్ఎస్ ద్వంద్వ విధానాలను ఎండగట్టాలనుకుంటున్నది. ఇంతకాలం గవర్నర్ పోషించిన పాత్రకు ఇకపైన వ్యవహరించే తీరులో స్పష్టమైన తేడా కనిపించే చాన్స్ ఉంది. ప్రధాని, అమిత్ షా ఇచ్చిన భరోసాతోనే గవర్నర్ ఇటీవల ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడి అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలన్నీ గవర్నర్ పేరుతోనే ఉత్తర్వులుగా, గెజిట్‌లుగా వెలువడతాయి. ఇలాంటి విధాన నిర్ణయాల్లో ఇకపైన గవర్నర్ లోతుగానే దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. కౌశిక్‌రెడ్డి వ్యవహారంలో కేబినెట్ ఆమోదం తీసుకున్నా ఆ ఫైల్‌లో పేర్కొన్న తీరులో తగిన స్పష్టత లోపించిందని గవర్నర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. సంతృప్తికరంగా లేనందునే ఆమోదం తెలపలేకపోయాయనని వివరించారు.

అవినీతిపై స్పెషల్ ఫోకస్

రాష్ట్రంలో భారీ స్థాయి అవినీతి చోటుచేసుకున్నదంటూ వివిధ పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ (సీవీసీ)కు, పీఎంవోకు ఫిర్యాదులు వెళ్లాయి. వాటిపైనా కార్యాచరణ మొదలైంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అధికారుల బృందాలు రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి. సీవీసీకి అందిన ఫిర్యాదులో భాగంగానే కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) బృందం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఫీల్డ్ స్టడీ చేస్తున్నది. కాంట్రాక్టు సంస్థలకు, అధికార పార్టీకి మధ్య ఉన్న బంధాన్ని విశ్లేషిస్తున్నాయి. కొంతకాలం క్రితం వివిధ సంస్థలపై ఐటీ సోదాలు జరిగాయి. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా డాక్యుమెంట్ల పరిశీలన జరుగుతున్నది. ఇదంతా ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చే ప్రక్రియలో భాగమేనంటున్నారు పలువురు. మరోవైపు అధికార పార్టీ నేతల, అధికారుల సంపాదన పైనా ఆరా తీసే పని మొదలైంది. కొన్ని విలువైన భూముల రిజిస్ట్రేషన్లలో ఎవరు ఎవరికి బినామీలో తేల్చడంపైనా కసరత్తు సాగుతున్నది. అధికార పార్టీ నేతల ప్రయాణాలు, పర్యటనలపైనా నజర్ పడింది. కొత్తగా ఉనికిలోకి వచ్చిన పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా అధికార పార్టీ నేతల, వారి బంధువుల పెట్టుబడులపైనా ఆరా తీయడం మొదలైంది.

రాజకీయంగా ఢీకొట్టే వ్యూహం

పార్టీపరంగా టీఆర్ఎస్‌ను బలంగా ఢీకొట్టేలా క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలంటూ రాష్ట్ర బీజేపీ నేతలకు సూచిస్తున్నది. కేంద్ర ప్రభుత్వంమీద టీఆర్ఎస్ దూకుడు, విమర్శలు, ఆరోపణలు పెంచినకొద్దీ బీజేపీ కూడా అంతే ఘాటుగా తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని స్పష్టం చేస్తున్నది. ఇప్పటికే పార్టీ తరఫున ఆర్గనైజింగ్ కార్యదర్శి బీఎల్ సంతోష్, శివప్రకాశ్‌ తదితరులు రాష్ట్రంలో పర్యటించి పార్టీ బలాలు, బలహీనతలపై అధ్యయనం చేసి అధిష్టానానికి నివేదిక సమర్పించారు. దానికి తగినట్లుగా ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అవలంబించాల్సిన విధానాలపై దృష్టి పెట్టింది. వడ్ల కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ లేవనెత్తే అంశాలకు పార్టీపరంగా దీటుగానే జవాబు ఇచ్చేలా పూర్తి వివరాలను కూడా ఆయా మంత్రిత్వశాఖల నుంచి పార్టీ నాయకత్వం అందజేసింది. పార్టీ ఏర్పాటుచేసే వివిధ కార్యక్రమాలకు కేంద్ర మంత్రులను కూడా హాజరయ్యేలా ఆదేశాలు ఇచ్చింది. బండి సంజయ్ రెండో దశ పాదయాత్రకు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఇవన్నీ రాజకీయంగా టీఆర్ఎస్‌ను ఢీకొట్టడానికి ఉపయోగపడతాయన్నది అధిష్టానం అభిప్రాయం. ఏక కాలంలో రాజ్యాంగపరమైన, పాలనాపరమైన ఉల్లంఘనలపై అటు గవర్నర్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి కార్నర్ చేయడం, ఇటు పార్టీపరంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకోవడంపై బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అవలంభిస్తున్నది.

Next Story