పత్తాలేని డిజిటల్ 'సర్వే'.. తెలంగాణలో పెరిగిన భూ తగదాలు

by Disha Web |
పత్తాలేని డిజిటల్ సర్వే.. తెలంగాణలో పెరిగిన భూ తగదాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: 'రాష్ట్రంలోని పేదల భూమి హక్కుల రక్షణ కోసమే ధరణి పోర్టల్‌ను అమల్లోకి తెచ్చినం. భూ తగాదాల్లేని భవిష్యత్తు తెలంగాణను నిర్మించే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తున్నది. వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ, రేఖాంశాలను(కో ఆర్డినేట్స్) గుర్తించి, తద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం'.. గతేడాది జూన్ 2న సమీక్షలో సీఎం కేసీఆర్.

ఏడాదైపాయే.. ఒక్కరి భూమి సర్వే చేయకపాయే. ఏ ఊరిలోనూ డిజిటల్ సర్వే మొదలుపెట్టకపాయే. రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది జూన్ 11 నుంచి పైలెట్ ప్రాజెక్టుగా 27 గ్రామాల్లో చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గంలోనే మూడు గ్రామాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. పలు సర్వే సంస్థలు కూడా ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. అప్పుడే అంతా అయిపోయినట్లు బిల్డప్ ఇచ్చారు. ఏడాది నుంచి సర్వే పనుల ప్రస్తావనే లేదు. సమగ్ర భూ సర్వేకు బదులుగా డిజిటల్ సర్వే(కో ఆర్డినేట్స్)తోనైనా సరిపెడతారని అందరూ భావించారు. అది పైలెట్ ప్రాజెక్టుకే కష్టమైంది. ఏడాది కాలంగా ఒక్క అడుగు పడలేదు. జిల్లాలు, డివిజన్లు, మండలాలు పెరిగాయి. అదే స్థాయిలో భూ వివాదాలు పెరిగాయి. అనేక సమస్యలు చుట్టముట్టాయి. ప్రతి ఊరిలోనూ భూ తగాదాలతో కొట్లాటలు, దాడుల పరంపర కొనసాగుతున్నది. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానన్న ప్రభుత్వ పెద్దలు ఆ ఊసే ఎత్తడం లేదు. ధరణి పోర్టల్ వివాదాలను పరిష్కరించడానికే 20 నెలలు పట్టింది. ఇంకనూ లెక్కలేనన్ని వివాదాలు అపరిష్కృతంగానే మిగిలాయి. ఇక డిజిటల్ సర్వే పూర్తి చేసేందుకు ఎంత సమయం తీసుకుంటారో అంచనా వేయొచ్చు.

ఎజెన్సీలు సిద్ధం

భూ సర్వే చేసేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో పాటు అనేక ప్రైవేటు సంస్థలు సిద్ధంగానే ఉన్నాయి. ఈ విషయం ఏడాది క్రితం సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలోనే స్పష్టమైంది. కానీ, ఏ కారణంతో డిజిటల్ సర్వేకు బ్రేకులు వేశారో కలెక్టర్లకు కూడా అంతుచిక్కడం లేదు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు 27 గ్రామాలను ఎంపిక చేసి జాబితాను ప్రభుత్వానికి పంపారు. తొలుత వివాదాల్లేని రెవెన్యూ గ్రామాల్లోనే నిర్వహించతలపెట్టారు. పట్టుదలగా చేస్తే ఆర్నెళ్లలోపే అన్ని గ్రామాల్లో పూర్తి చేయగల సమర్థత కలిగిన అనేక ప్రభుత్వ, ప్రైవేటు సర్వే ఏజెన్సీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సమగ్ర భూ సర్వేకు నిధులు కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నది. 2014లో ఈ మేరకు రూ.84 కోట్లు విడుదల చేసింది. ఆ మొత్తం దేని కోసం ఖర్చు చేశారో అంతుచిక్కదు. రాష్ట్ర ప్రభుత్వం తొలి మూడేండ్లు బడ్జెట్‌లో సమగ్ర భూ సర్వే కోసం రూ.500 కోట్ల వంతున కేటాయించింది. కానీ, బడ్జెట్ మాత్రం విడుదల కాలేదు. సింహభాగం కేంద్రం భరించేందుకు సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు రాకపోవడం విస్మయానికి గురి చేస్తున్నది.

ఏపీలో శాశ్వత భూహక్కులు

పొరుగున ఏపీలో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 100 సంవత్సరాల తర్వాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేలో భాగంగా మొదటి దశలో 51 గ్రామాల్లోని 12,776 మంది భూ యజమానుల 21,404 భూ కమతాలకు సంబంధించిన 29,563 ఎకరాల భూములను రీసర్వే చేసి 3,304 అభ్యంతరాలను పరిష్కరించింది. భూమి రికార్డులను ఈ ఏడాది జనవరి 18న ప్రజలకు అంకితం చేశారు. జూన్‌ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలోని భూముల రీసర్వే పూర్తి, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రూ.1000 కోట్ల వ్యయంతో 4,500 సర్వే బృందాలు, 70 కార్స్‌ బేస్‌ స్టేషన్లు, 1500 రోవర్ల ద్వారా అత్యాధునిక సాంకేతికతో రీసర్వే చేపట్టారు. ప్రతి భూకమతానికి విడిగా ఆకాంక్ష, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన భూకమత పటం అందజేస్తున్నారు.

రిజిస్ట్రేషన్ తోనే సర్వే మ్యాపు

తెలంగాణలో భూ తగదాలు పెరుగుతున్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసుల్లో భూసంబంధ అంశాలతో ముడిపడినవే అత్యధికం. దాంతో సివిల్ తగదాల్లో పోలీసులు తలదూరుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిహద్దు వివాదాలు నానాటికీ పెరుగుతున్నాయి. క్రయ విక్రయాల సందర్భంలో భూమికి సంబంధించిన సర్వే మ్యాపును జత చేసే ప్రక్రియను ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఉదాహారణకు కర్నాటకలో ఏ స్థిరాస్తి కొనుగోలు చేయాలన్నా దానికి సర్వే మ్యాపును జత చేయాల్సిందే. దీంతో భవిష్యత్తులోనూ సరిహద్దు వివాదాలు తలెత్తవని భూ చట్టాల నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సేల్ డీడ్‌లో సరిహద్దుల ప్రస్తావనే లేదు. అమ్మే వ్యక్తి, కొనే వ్యక్తి ఏది చెబితే ఆ వివరాలతోనే క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి. నిజానికి కొనుగోలుకు ముందే సర్వే చేయించుకోవడం వల్ల వివాదాలు తలెత్తే అవకాశమే ఉండదు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే సేల్ డీడ్ కి ముందే బయటపడతాయి. దాంతో రూ.లక్షలు పెట్టి కొనే వ్యక్తులకు ఎలాంటి సమస్య ఉండదు.

సర్వే దరఖాస్తులు

రాష్ట్ర వ్యాప్తంగా భూ కమతాల సరిహద్దు వివాదాలు అనేకం ఉన్నాయి. తమ భూమిని సర్వే చేసి పెట్టండంటూ వచ్చే దరఖాస్తుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. 2014 కు ముందు, ప్రస్తుత దరఖాస్తుల సంఖ్యకు మధ్య ఎంతో తేడా ఉన్నది. ప్రతి ఊరిలోనూ రికార్డుల్లోని సర్వే నంబరుకు, పొషిషన్‌లోని క్షేత్ర స్థాయికి పొంతనే లేకుండాపోతున్నది. ఉదాహారణకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలో పొషిషన్, రికార్డుకు మధ్య పదుల సంఖ్యలో సర్వే నంబర్లలో వ్యత్యాసం ఉన్నది. సర్వే నంబర్ల ప్రకారమే భూమిని స్వాధీనం చేస్తే సగం మంది రైతుల పొషిషన్ మారాల్సి వస్తుంది. ఇలా ప్రతి ఊరిలోనూ అంతులేని వ్యత్యాసాలు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి సమస్యకు శాశ్వత పరిష్కారం సమగ్ర భూ సర్వే. ఐతే రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ సర్వే(కో ఆర్డినేట్స్) చేసేందుకు వెనుకడుగు వేస్తుండడం విడ్డూరంగా ఉన్నది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో భూ సరిహద్దు వివాదాలు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed