జగన్, వైసీపీ మంత్రులు మగతనం అంటే అది కాదు.. దివ్యవాణి ఫైర్

by Disha Web |
జగన్, వైసీపీ మంత్రులు మగతనం అంటే అది కాదు.. దివ్యవాణి ఫైర్
X

దిశ, ఏపీ బ్యూరో : 'తన బాబాయ్ ప్రాణాలతో చెలగాటమాడి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ప్రజల ప్రాణాలతో కూడా అలానే ఆడుకోవాలని చూస్తే, ఆ ఆటే ఆయన కథను ముగిస్తుంది. నాటుసారా మరణాలపై కట్టు కథలు చెప్పిన ముఖ్యమంత్రి, మంత్రులు సిగ్గులేకుండా మగతనం గురించి మాట్లాడుతున్నారు. మంత్రులు అనుకనట్లు ముఖ్యమంత్రికి ఉంది నిజమైన మగతనంకాదని వారు తెలుసుకుంటే మంచిది. ప్రజలిచ్చిన అధికారంతో వారికి హాని కలిగించకుండా, చేసిన తప్పులను సరిచేసుకుంటూ, వారు మెచ్చేలా పాలన చేయడమే అసలైన మగతనం. చంద్రబాబు హయాంలో మద్యం సీసాలు పగలగొట్టి చిందులు తొక్కి, వీరంగం వేసిన ఎమ్మెల్యే రోజా జంగారెడ్డిగూడెం మరణాలపై స్పందించదేం? అపర రాజకీయ చాణక్యుడైన చంద్రబాబుకి, ప్రజల ప్రాణాలు తీస్తున్న దుర్మార్గమైన అనకొండ నుంచి రాష్ట్రాన్ని ఎలా కాపాడాలో బాగా తెలుసు' అని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి చెప్పుకొచ్చారు.

జగన్‌ది నరంలేని నాలుక

'వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం శిరస్సులేని మొండెంలా తయారైంది. ముఖ్యమంత్రి పొరపాటున కూడా ఎవరికీ హోలీ శుభాకాంక్షలు చెప్పకపోవడమే మంచిది. జగన్ నిర్వాకంతో జంగారెడ్డిగూడెంలో 28కుటుంబాలవారు గుండెలవిసేలా విలపిస్తున్నారు' అని టీడీపీ అధికారప్రతినిధి శ్రీమతి దివ్యవాణి ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

కల్తీసారా మరణాలను సహజమరణాలుగా చిత్రీకరించిన ముఖ్యమంత్రి తెలివితేటలు చూసి ప్రజలంతా విస్తుపోతున్నారు. వైఎస్ జగన్ నరం లేని నాలుక ఎంతఈజీగా అబద్ధాలాడుతుందో చెప్పడానికి నాడు జరిగిన కోడి కత్తి డ్రామా మొదలు, నేడు జరిగిన సారా మరణాలవరకు అనేక ఉదంతాలున్నాయి. బాబాయ్ గొడ్డలి పోటు కథ ముఖ్యమంత్రి నరంలేని నాలుక నుంచి జారు వాలిన అబద్ధాల ఉదంతాల్లో అగ్రస్థానంలో ఉంటుంది. 28 కుటుంబాల్లో సంతోషం అనేది లేకుండా చేసింది కాక, సారా తాగి చనిపోయినవారివి సహజ మరణాలే అని ముఖ్యమంత్రి నాలుక మడతపెట్టడం క్షమించరాని నేరం. జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడితే బీబీ మంత్రి.. అలియాస్ బూతుల మంత్రి నాని కూడా సహజ మరణాలే అంటూ గొంతుచించుకున్నాడు'అని దివ్యవాణి ధ్వజమెత్తారు.

రోజాకు జగన్ భజన తప్ప వేరేది లేదు

'కల్లబొల్లి మాటలతో.. అవాస్తవాలు.. అబద్ధాలతో గతంలో చంద్రబాబుపై నాడు విష ప్రచారం చేసిన ఎమ్మెల్యే రోజా ఇప్పుడు సారా మరణాలపై స్పందించదేం? రోజా ఒక్కరే కాదు.. అన్న విజయం కోసం పాదయాత్రచేసి, చంద్రబాబు వస్తే యువతకు జాబ్ వస్తుందా అని ప్రశ్నించిన షర్మిల కూడా జంగారెడ్డిగూడెం అంశంపై స్పందించాలి. రోజా, జగన్‌ని నిజంగా అభిమానించేది.. ప్రేమించేది అయితే, ఆయన ఇచ్చిన మద్యపాన నిషేధం ఏమైందో రోజా సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి సాగిస్తున్న నాసిరకం మద్యం అమ్మకాలు, కల్తీ సారా అమ్మకాలను ఆమె ఎలాసమర్థిస్తుందో కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి' అని దివ్యవాణి డిమాండ్ చేశారు.

'రోజాకు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి భజన చేయడం తప్ప వేరే పనేమీ లేనట్లుంది. తన నగరి నియోజకవర్గంలో జరిగేవాటిపై ఆమె ఎలాగూ స్పందించదు.. పట్టించుకోదు. కనీసం జంగారెడ్డి గూడెం సారామరణాలపై కూడా స్పందించలేని దౌర్భాగ్యపుస్థితిలో ఆమె.. ఆమె పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం సిగ్గుచేటు. ఎక్సైజ్, పోలీస్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ, కల్తీ సారా అమ్మకాలను వదిలేయబట్టే, నేడు 28 మంది ప్రాణాలు పోయాయి. రాష్ట్రంలో వేసవివచ్చినట్టే ఎండలు పెరిగాయి. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో మంచినీళ్లు దొరకడం లేదుగానీ.. జగన్మోహన్ రెడ్డి అమ్మిస్తున్న కల్తీమద్యం, నాటుసారా వంటివి ఎక్కడపడితే అక్కడ లభిస్తున్నాయి' అని దివ్యవాణి ఆరోపించారు.

మంత్రి ఆళ్ల నాని బాధితులను బెదిరిస్తున్నారు

బూతుల మంత్రి నాని.. సీఎం వైఎస్ జగన్ చర్యలను సమర్థిస్తూ ఆయనపై ఉమ్మేయడం అంటే సూర్యుడిపై ఉమ్మేయడమే అంటున్నాడు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులంతా వారిముఖాలపై వారి ఉమ్మే వేసుకోవడానికి కూడా అనర్హులే. జంగారెడ్డిగూడెంలోని డాంగే ప్రాంతంలో ముగ్గురు వైసీపీ నేతలు సారా విక్రయాలు సాగిస్తున్నారని.. వాటిలో బ్యాటరీల్లో వాడే పదార్థాలతో పాటు.. మిథైల్ వంటి ఇతరత్రా హానికారక పదార్ధాలు కలుపుతున్నారని మృతుల కుటుంబీకులు చెబుతున్నారు. వాస్తవాలు చెప్తున్నా వారిని మంత్రి ఆళ్ల నాని తన అనుచరులను రంగంలోకి దింపి, వారిని బెదిరించడంతో పాటు ఉద్యోగాలు, డబ్బులిస్తామని ప్రలోభ పెట్టారు అని దివ్యవాణి ధ్వజమెత్తారు.

జగన్ రెడ్డి భవిష్యత్‌కు ముగింపు పలుకుతుంది

ముఖ్యమంత్రి తన బాబాయ్ ప్రాణాలతో చెలగాటమాడినట్టుగా రాష్ట్ర ప్రజలప్రాణాలతో ఆడుకోవడం ఆయనకే చేటు. ప్రజల ప్రాణాలు పణంగాపెట్టి, ముఖ్యమంత్రి ఆడుతున్న ఆట ఆయన భవిష్యత్‌కే ముగింపు పలుకుతుంది. గుడివాడలో కేసినో ఆడించి.. తప్పించుకున్నంత తేలిగ్గా జంగారెడ్డిగూడెం మరణాలపై కూడా తప్పించుకోవచ్చని బూతుల మంత్రి అనుకుంటున్నారేమో.. అది ఆయనకు, ఆయన ప్రభుత్వానికి మగతనంకానేకాదని తెలుసుకుంటే మంచిది. ప్రజల విషయంలో చేస్తున్న తప్పులను సరిచేసుకుని పరిపాలన చేయడమే అసలైన మగతనం అని నాని గ్రహించాలి. జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలపై సమాధానం చెప్పకుండా అసెంబ్లీ, మండలిలో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించుకోండి. టీడీపీ హయాంలో మద్యం అమ్మకాలపై ఏటా రూ.5 వేల నుంచి రూ.6 వేల కోట్ల ఆదాయం వస్తే ఈ ముఖ్యమంత్రి వచ్చాక దాన్ని రూ.16,500కోట్లకు పెంచాడు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన పెద్దమనిషే మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి మరీ రూ.25 వేలు కోట్ల అప్పులు తెచ్చాడు. ఉన్న మద్యం దుకాణాలు తొలగించకుండా ముఖ్యమంత్రే స్వయంగా వాక్ ఇన్ స్టోర్స్ పేరుతో కొత్త దుకాణాలు తెరిపించాడు. ఇదేనా జగన్ చెప్పిన మద్యపాన నిషేధం? అని దివ్యవాణి నిలదీశారు.



Next Story

Most Viewed