అనుమానస్పద స్థితిలో విద్యార్థిని మృతి.. అదే కారణమంటూ పెద్ద ఎత్తున ఆందోళన

by Disha Web Desk 19 |
అనుమానస్పద స్థితిలో విద్యార్థిని మృతి.. అదే కారణమంటూ పెద్ద ఎత్తున ఆందోళన
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: గిరిజన విద్యార్థిని అనుమానస్పద మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హాస్టల్‌లో విషపూరిత ఆహారం వల్లనే విద్యార్థిని మృతి చెందిందని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలతోపాటు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశాయి. సర్కార్ నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్లనే హాస్టల్‌లో అహారం విషపూరితమైందని, ఆ అహరాన్ని తిన్న విద్యార్థిని మృతి చెందిందని ఆరోపించాయి. విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్లితే.. నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట మండలం రాఘవపురానికి చెందిన సుభాష్, లలితల కుమార్తె కాట్రావత్ అనిత ఎనిమిదవ తరగతి చదువుతూ.. ఫిర్జాదిగూడలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో ఉంటుంది. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత అనిత ఒక్కసారిగా కుప్పకూలింది.

దీంతో హాస్టల్ నిర్వహాకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అంతలోనే ఆమె మృతి చెందింది. అనంతరం ఆమె మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా జెడ్పీ కాంగ్రెస్ పార్టీ ప్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి గురువారం ఉదయం హాస్టల్‌కు చేరుకున్నారు. విద్యార్థికి న్యాయం చేయాలని పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు. బీజేపీ నాయకులు సైతం హాస్టల్ వద్ద ధర్నా నిర్వహించారు. విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చి విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులతో సాంఘిక సంక్షేమవసతి భవనంలో అధికారులు చర్చలు జరిపారు. కీసర ఆర్డీఓ రవి విద్యార్థి తల్లిదండ్రులకు డబుల్ బెడ్ రూమ్ ఇప్పించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని హామి ఇచ్చారు. అదేవిధంగా రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు.


Next Story

Most Viewed