కారులో పంది షికారు.. అస‌లు వెళ్లింది తిన‌డానికే..?!

by Sumithra |   ( Updated:2022-05-03 14:42:12.0  )
కారులో పంది షికారు.. అస‌లు వెళ్లింది తిన‌డానికే..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇది ఊర పందికాదు, పెంపుడు పంది అంత‌కంటే కాదు, పాపం తిండిలేక రోడ్ల వెంట తిరిగే ఉడుము పంది. అడ‌వి పంది. ఇలాంటి పంది కారులో ప్ర‌యాణం చేయ‌డ‌మేంట‌ని ఆశ్చ‌ర్య‌పోవ‌చ్చు గాక‌, అదే ఇక్క‌డ స్పెష‌ల్‌. అందుకే, నెట్టింట్లో ఈ పంది యాత్ర కాస్త ఆస‌క్తిని క‌లిగించింది. వివ‌రాల్లోకి వెళితే, ఆకలితో ఉన్న ఓ పంది పిల్ల అటుఇటూ తిరుగుతుంది. ఈ క్ర‌మంలో ఓ ఇంటి ముందు ఆపి ఉన్న కారును ఢీ కొట్టింది. స‌రే, దాని దారిన అది పోకుండా, దానికి ఏం వాస‌నొచ్చిందో గానీ, కారులో ఎక్కింది. స‌ద‌రు వరాహం కాస్తా వాహ‌నంలో ఇరుక్కుపోయింది.

ద‌క్షిణ అమెరికాలో జువెలినాస్‌గా పిలిచే ఈ పందులు కరేబియన్‌లోని ట్రినిడాడ్, ఉత్తర అమెరికాలోని నైరుతి ప్రాంతంలో ఎక్కువ‌గా కనిపిస్తాయి. ఇక‌, సుబారు స్టేషన్ వ్యాగన్‌లో ఇలాంటి జావెలినా ఇరుక్కుపోయిందని, కాన్‌విల్లే ప్రాతం నుండి ఓ ఫోన్ కాల్ వచ్చినట్లు యవాపై కౌంటీలోని డిప్యూటీ 'ది గార్డియన్' ప‌త్రిక‌కు నివేదించారు. కారు హ్యాచ్‌బ్యాక్ రాత్రిపూట తెరిచి ఉండ‌టంతో పంది లోపలికి ప్రవేశించిన‌ట్లు దర్యాప్తులో వెల్లడైంది. చీటోస్‌ బ్యాగ్‌ని తీసుకోవడానికి జావెలినా వాహనంలోకి ప్రవేశించిందని, అయితే అనుకోకుండా వెనుక డోరు మూసుకుపోవ‌డంతో లోపల ఇరుక్కుపోయిందని పోలీసులు తెలిపారు. త‌ప్పించుకునే ప్రయత్నంలో న్యూట్ర‌ల్‌లో ఉన్న‌ కారు కాస్త గేర్‌లో ప‌డ‌గానే కారు కాస్త దూరం ముందుకు ప్ర‌యాణించింది. రోడ్డు మ‌ధ్య‌లో దేన్నో గుద్దుకొని ఆగిపోయింది. మొత్తానికి పోలీసులు వ‌చ్చి హ్యాచ్ తెర‌వ‌గానే, పంది బ‌య‌ట‌కి దూకి అడివిలోకి పారిపోయింది.

Advertisement

Next Story

Most Viewed