అగ్నిపథ్‌పై సియాచిన్ హీరో ధ్వజం

by Dishanational1 |
అగ్నిపథ్‌పై సియాచిన్ హీరో ధ్వజం
X

జమ్మూ: భారతీయ సైన్యాన్ని విధ్వంసం చేసి, పాకిస్తాన్, చైనా దేశాలకు ప్రయోజనం కలిగించే అగ్నిపథ్ స్కీమ్ వల్ల దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హానరరీ కెప్టెన్ బాణా సింగ్ తెలిపారు. పరమ్ వీర్ చక్ర అవార్డీలలో ప్రస్తుతం జీవించి ఉన్న ఏకైక వ్యక్తి, లెజెండరీ సైనిక కెప్టెన్‌గా చరిత్రకెక్కిన బాణా సింగ్, కీలక అంశాలపై ఏకపక్ష నిర్ణయం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. జమ్మూలోని తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడిన బాణా సింగ్... సైనిక నియామకాల్లో నాలుగేళ్ల కాంట్రాక్టుతో కేంద్రప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ భారత సైన్యాన్ని సర్వనాశనం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయరాదని సూచించారు. భారత సైన్యంలో సుబేదార్ మేజర్‌గా పదవీ విరమణ చేసిన బాణా సింగ్‌కి తర్వాత గౌరవ కెప్టెన్ ర్యాంకును ఇచ్చారు.

మనసు చెప్పినట్లే మాట్లాడతా... సింగ్

అగ్నిపథ్ స్కీమ్‌ను విమర్శిస్తూ సింగ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఈ విషయంపై సింగ్‌కు చాలామంది ఫోన్లు చేస్తుండటంతో ఆయన తన ట్వీట్‌ని తొలగించారు. కానీ సైన్యం తరపున దాని సంక్షేమానికి అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటానని, తన మనస్సు చెప్పినట్లు మాట్లాడటం కొనసాగిస్తానని సింగ్ తేల్చి చెప్పారు. సియాచిన్ హీరో‌గా కీర్తి గాంచిన బాణా సింగ్ 1987 జూన్‌లో సముద్రమట్టానికి 21 వేల అడుగుల ఎత్తున పాకిస్తాన్‌కి చెందిన క్వాడ్ ఇ అజామ్ పోస్టుపై దాడికి నాయకత్వం వహించారు. ఈ దాడిలో ఆరుగురు పాక్ సైనికులు చనిపోగా, వ్యూహాత్మక గస్తీ కేంద్రం భారత్ కైవసమైంది.

ఇంత నిరంకుశ నిర్ణయమా?

సీనియర్ సైనికాధికారులతో, ఆర్మీతో సంప్రదించకుండా ప్రజాస్వామ్యంలో ఇలాంటి మౌలిక నిర్ణయాలను తీసుకోరాదని సింగ్ అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో యుద్దాల్లో పాల్గొన్న, సైన్యం గురించి బాగా తెలిసి ఉన్న వారితో చర్చించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మునుపెన్నడూ జరగలేదని చెప్పారు. ఇది కచ్చితంగా నిరంకుశత్వమే. నేను నిర్ణయం తీసుకున్నాను, దీన్ని ఆమలు చేయాల్సిందే అంటే బలవంతుడిదే రాజ్యం అనే భావన కిందికే వస్తుందని సింగ్ వ్యాఖ్యానించారు.

స్కీమ్‌తో తీవ్ర హాని.. దేశాన్ని రక్షించండి

దేశాన్ని రక్షించండి, అగ్నిపథ్ స్కీమ్ మనల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. భారత్ కీలక దశలోకి ప్రయాణిస్తోంది. మాతృదేశానికి యువతే భవిష్యత్తు అని సింగ్ మంగళవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టు అగ్నిపథ్ పథకంపై సోషల్ మీడియాలో విస్తృతమైన విమర్శలకు దారితీసింది. అనేకమంది రిటైర్డ్ మిలటరీ ఆధికారులు సింగ్‌ను అభినందిస్తూ ఈ అంశంపై మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెప్పారు. కానీ సింగ్‌పై విమర్శల దాడి మొదలు కావడంతో ఈ పోస్టును బుధవారం ఉదయానికే తొలగించారు.

సైన్యం అంటే ఆటబొమ్మలు కాదు

తర్వాత మీడియా ప్రశ్నలకు సింగ్ సమాధానమిచ్చారు. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని ఇప్పటికే సిద్ధమైపోయినందున ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం అనుకున్నాను. పైగా ఒక వ్యక్తి ఈ విషయంపై మాట్లాడినా పెద్దగా ప్రయోజనం లేదు. దేశం మొత్తం ఈ విషయంపై మాట్లాడాలి. దేశం మొత్తం అగ్నిపథ్ స్కీమ్‌ వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని సియాచిన్ హీరో బాణాసింగ్ చెప్పారు. అగ్నిపథ్ స్కీమ్ మన కంటే మన శత్రువులకే ఉపయోగపడుతుంది. సైన్యం అంటే ఆటలాడుకోవడం కాదు. సంవత్సరాల కఠిన శిక్షణతో సైన్యం రూపొందుతుంది, అలాంటిది ఆరునెలల్లో అగ్నివీర్‌లు ఏం శిక్షణ పొందగలరు అని సింగ్ ప్రశ్నించారు.

ఈ స్కీమ్‌ని నిర్ణయించిన వారికి సాయుధ బలగాల గురించి ఏమీ తెలీదు. స్యైన్యం అంటే ఆటబొమ్మలు కాదు. ఈ పథకం కొనసాగితే చైనా, పాకిస్తాన్ ప్రయోజనం పొందుతాయి. మన భూభాగాల్లోకి చైనా మరింతగా ప్రవేశిస్తుంది అని సింగ్ పేర్కొన్నారు.

సియాచిన్ హీరోగా పేరొందిన బాణా సింగ్‌ను ఆర్మీ మోడల్‌గా గుర్తిస్తూ, ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే పెరేడ్, ఆర్మీ డే వేడుకలకు ప్రత్యేక అతిధిగా ఆహ్వానిస్తుంటారు.


Next Story

Most Viewed