మెరిసిన భారత మహిళా ఆర్చరీలు

by Disha Web |
మెరిసిన భారత మహిళా ఆర్చరీలు
X

పారిస్ : ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్‌ స్టేజ్-3లో భారత మహిళా ఆర్చరీలు సత్తాచాటారు. దీపికా కుమారి, అంకిత, సిమ్రాన్జీత్ కౌర్‌తో కూడిన భారత ఉమెన్స్ రికర్వ్ టీమ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో 13వ స్థానంలో నిలిచిన భారత త్రయం.. ఆ తర్వాత బలంగా పుంజుకుంది. తొలి రౌండ్‌లో బై లభించడంతో నేరుగా సెకండ్ రౌండ్‌ చేరుకున్న భారత్ 5-1 పాయింట్ల తేడాతో ఉక్రెయిన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు సెట్లను గెలుచుకోగా.. మూడో సెట్‌ను టైగా చేసుకుంది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై 6-0 పాయింట్లతో భారత త్రయం ఏకపక్ష విజయం సాధించింది. 59-51, 59-51, 58-50 తేడాతో వరుసగా మూడు సెట్లను కైవసం చేసుకుంది. టర్కీతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ భారత్ అదే దూకుడు కొనసాగించింది. అయితే, టర్కీ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. 56-51, 57-56తో వరుసగా రెండు సెట్లు గెలిచిన భారత్.. 54-55తో తృటిలో మూడో సెట్‌ను కోల్పోయింది. ఇక, నాలుగో సెట్‌ను 55-55తో టై చేసుకుంది. మొత్తంగా భారత్ 5-3 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చైనీస్ తైపీ జట్టుతో తలపడనున్నది.

Next Story