నీళ్లు లేవు.. బిల్లులు రావు.. ఇంకెందుకు సర్పంచ్ గిరి

by Dishanational1 |
నీళ్లు లేవు.. బిల్లులు రావు.. ఇంకెందుకు సర్పంచ్ గిరి
X

దిశ, అనంతగిరి: ప్రభుత్వ పాలనపై అధికార పార్టీ సర్పంచులే ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకానొక దశలో అధికార పార్టీ సర్పంచులకు, అధికార పార్టీ ఎంపీపీకి, ప్రభుత్వ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సర్పంచులు అధికారులను నిలదీశారు. నిధులు లేవు.. చేసిన పనులకు బిల్లులు రావడం లేదు.. మళ్లీ అభివృద్ధి పనులు చేయాలంటారు.. తెచ్చిన అప్పులకు దిక్కులేదు.. వడ్డీలే కట్టలేకపోతున్నాం.. సర్పంచ్ గా ఎందుకు గెలిచామా అని నెత్తీ నోరు కొట్టుకునే పరిస్థితి దాపురించిందని అనంతగిరి మండల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో వారు తమ నిరసన గళాన్ని బాహాటంగానే వ్యక్తపరిచారు.

వాడివేడిగా సర్వసభ్య సమావేశం

అధికార పార్టీ సర్పంచులే ప్రభుత్వ అధికారులను నిలదీస్తూ ఉండడంతో సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ క్రమంలోనే అనంతగిరి గ్రామ సర్పంచ్ వేనేపల్లి వెంకటేశ్వరరావు అదేవిధంగా కిష్టాపురం గ్రామ సర్పంచ్ లక్ష్మాల జానమ్మ సర్వసభ్య సమావేశం వేదిక వద్దకు వచ్చి ప్లకార్డులతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సర్పంచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం 2019లో మండల ప్రజా పరిషత్ కార్యాలయం మరమ్మత్తులలో భాగంగా సుమారుగా 3 లక్షల 60 వేల రూపాయలను అనంతగిరి గ్రామ పంచాయతీ నిధుల నుండి మండల పరిషత్ కార్యాలయానికి కేటాయించామని, అప్పటి ఎంపీడీవో అభ్యర్థన మేరకే నిధులను ఇచ్చామని, మూడు సంవత్సరాలు గడుస్తున్నా మా నిధులు కేటాయించడం లేదని అనేకమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు.

ఎంపీపీకి, సర్పంచ్ కి మధ్య వాగ్వాదం

తమ గ్రామ పంచాయతీ నిధులు మాకు తిరిగి కేటాయిస్తే తమ గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకుంటామని అనంతగిరి సర్పంచ్ వెంకటేశ్వరరావు అన్నారు. ఇదే విషయమై ఎంపీపీకి, ఎంపీడీవోకి అనేకమార్లు తెలియజేసినా వారు పెడచెవున పెడుతుండడంతో ఆయన సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంపీపీకి, సర్పంచ్ కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపీపీ ఒకానొక దశలో నీ ఇంట్లో నిధులు ఏమైనా పెట్టావా అని ప్రశ్నించడంతో సర్పంచ్ ఇంట్లో నిధులు కాదు తన గ్రామ పంచాయతీ నిధులు తనకు ఇవ్వండి.. గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకుంటాను కదా అని చెప్పడంతో ఇద్దరి మధ్య వాదన చోటు చేసుకోవడంతో అధికారులు కలగజేసుకుని వారిద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

మంత్రి ఆదేశించినా ట్యాంక్ నిర్మించలే

కిష్టాపురం గ్రామ సర్పంచ్ జానమ్మ సైతం తమ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ స్థానంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను నిర్మిస్తామని అధికారులు చెప్పి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని ఆమె ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశం వేదిక వద్దకు వచ్చి ప్లకార్డును ప్రదర్శిస్తూ బైఠాయించారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం వాటర్ ట్యాంక్ నిర్మించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇంతవరకు వాటర్ ట్యాంక్ నిర్వహించకపోవడంపై ఆమె ఎంపీపీ, అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. మంత్రి చెప్పినా పట్టించుకోకపోవడం ఏంటని ఆమె ప్రశ్నించారు.

అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి: ఎంపీపీ

మిగిలిన గ్రామ సర్పంచులు సైతం చేసిన పనులకు బిల్లులు రావడం లేదని, త్వరితగతిన బిల్లులు వచ్చే విధంగా కృషి చేయాలని ఎంపీపీని కోరారు. గ్రామాలలో మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎంపీపీ జోక్యం చేసుకుని తప్పకుండా సర్పంచులు లేవనెత్తినటువంటి సమస్యలను జిల్లా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, త్వరితగతిన సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సర్పంచులకు ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు, సర్పంచులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందని, ఈ సందర్భంగా ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు తెలిపారు.

కొసమెరుపు ఇదిలా ఉండగా ఇంతవరకు మౌనం వహించిన అధికార పార్టీ సర్పంచులే సర్వసభ్య సమావేశంలో అధికారపార్టీ ఎంపీపీని, అదేవిధంగా అధికారులను నిలదీయడంతో ప్రతిపక్ష పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు నివ్వెరపోయి చూశారు. ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహశీల్దార్ సంతోష్ కిరణ్, వైస్ ఎంపీపీ ధరావత్ రామ, ఎంపీవో నాగేశ్వరరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed