ఆయుధాలు పంపండి.. చైనాకు రష్యా వినతి

by Disha Web Desk 17 |
ఆయుధాలు పంపండి.. చైనాకు రష్యా వినతి
X

కీవ్: ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న సైనిక దాడి తలపెట్టిన తర్వాత తొలిసారిగా తనకు ఆయుధాలను పంపాలంటూ రష్యా తన మిత్రపక్షమైన చైనాను కోరినట్లు అమెరికన్ పత్రికలు పేర్కొన్నాయి. అమెరికా అధికార వర్గాలను కోట్ చేసిన మీడియా, చైనా నుంచి ఎలాంటి ఆయుధాలు కావాలని రష్యా కోరిందో చెప్పడానికి అమెరికా అధికారులు నిరాకరించారని పేర్కొంది. అయితే అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం మీడియా వార్తలను ఖండించలేదు కానీ ఉక్రెయిన్ లోని ఉద్రిక్త పరిస్థితిని తొలగించడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని తొలగించడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ పరిస్థితి మరింతగా అదుపు తప్పకుండా చల్లార్చడానికి ప్రయత్నించాలి అని చైనా ఎంబసీ పేర్కొంది.

కాగా, ఉక్రెయిన్ లోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై దాడి చేయడాన్ని రష్యా వెంటనే నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి డిమాండ్ చేసింది. ఆసుపత్రులపై దాడులు అవధులు మీరిన క్రూరత్వానికి ప్రతీక అని ఐరాస చిల్డ్రన్స్ ఫండ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరాస పాపులేషన్ ఫండ్ వ్యాఖ్యానించాయి.



Next Story

Most Viewed