దొంగ నాటకాలు ఆడుతున్న బీజేపీ, టీఆర్ఎస్ : ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

by Disha Web Desk 13 |
దొంగ నాటకాలు ఆడుతున్న బీజేపీ, టీఆర్ఎస్ : ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, మేళ్లచెరువు: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆడుతున్న దొంగ నాటకాలను ప్రజలు గమనించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం మేళ్లచెరువు మండల కేంద్రం ఎస్సీ కాలనీలో జెండా ఆవిష్కరించి, అక్కడి మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మేళ్లచెరువు మెయిన్ రోడ్‌పై జెండా ఆవిష్కరించి మాట్లాడారు. బహుజనులకు రాజకీయ అధికారం దక్కితేనే విముక్తి లభిస్తుందని అన్నారు. అన్నం పెట్టే రైతులకు గిట్టుబాటు ధర లేక మిలర్ల చేతిలో మోసాలకు గురై తక్కువ రేట్లకు పంటను అమ్ముకుంటున్నారని వాపోయారు. వరి పంట కొనుగోలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలుపై సీఎం ఢిల్లీలో ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆడుతున్న దొంగ నాటకాలను ప్రజలు గమనించాలని కోరారు.


మేళ్లచెరువులో సిమెంట్ పరిశ్రమలతో తీవ్ర కాలుష్యం వెలువడుతున్న పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానికులకు పరిశ్రమల్లో ఉద్యోగాలను అర్హత బట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఇక్కడి దళిత మహిళలు బహిరంగంగా బహిర్భూమికి వెళ్లాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. నెల్లికల్ ఎత్తిపోతల ప్రాజెక్టు కేవలం శంకుస్థాపనకే పరిమితం అయ్యాయని అన్నారు. బడ్జెట్ లో ప్రాజెక్టు నిర్మాణానికి సరిపడా నిధులు కేటాయించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. తెలంగాణలో రూ.లక్షల కోట్ల సంపాదన కుటుంబం గుప్పిట్లో బందీ అయిందని, బీఎస్పీ అధికారంలోకి వస్తే దోచుకున్న సంపదంతా పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం వేపల సింగారం లో వరి కళ్ళాలను సందర్శించిన ఆయన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed