రాష్ట్రంలో ఫోర్త్ వేవ్ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన వైద్యశాఖ

by Disha Web Desk 2 |
రాష్ట్రంలో ఫోర్త్ వేవ్ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన వైద్యశాఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా ఫోర్త్​వేవ్​షురూ అయింది. గత పదిహేను రోజులుగా కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో దీన్ని ఫోర్త్​వేవ్‌గానే పరిగణించవచ్చని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేస్తున్నది. కానీ, గత మూడు వేవ్‌ల తరహాలో కేసులు తీవ్రత ఉండదని ఆరోగ్యశాఖ ఉపశమనం కలిగే వార్త చెప్పింది. ప్రస్తుతానికి అర్బన్​ప్రాంతాల్లో మాత్రమే బాధితులు తేలుతున్నారు. జిల్లాల్లో డైలీ ఒకటి నుంచి ఐదు కేసుల కంటే ఎక్కువ నమోదు కావడం లేదు. రాబోయే రోజుల్లో జిల్లాల్లోనూ కొంత వ్యాప్తిని జరిగే ప్రమాదం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం‌తో డెవలప్ అయిన ఇమ్యూనిటీ వలన అత్యధిక మంది జనాల్లో వైరస్‌ను తట్టుకునే శక్తి పెరిగింది. దీంతోనే రాష్ట్రంలో ర్యాపిడ్‌గా కేసులు పెరిగే అవకాశం లేదని ఎపిడమాలజిస్టులు నొక్కి చెబుతున్నారు. అయితే వేరియంట్లలో మార్పు ఉండటంతో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆఫీసర్లు సూచిస్తున్నారు.

మళ్లీ ధరించాలే

కేసులు పెరుగుతుండంతో మళ్లీ మాస్కు మస్ట్ నిబంధన అమలు కానున్నది. ఇప్పటికే ఐటీ, సర్కార్ కార్యాలయాల్లో తప్పనిసరిగా పాటించాల్సిందేనని యాజమాన్యాలు అంతర్గత ఆదేశాలిచ్చాయి. భౌతిక దూరం, శానిటేషన్​వంటివి కూడా మెయింటెన్​చేయాలని ఐటీ సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉన్నతాధికారులూ సిబ్బందికి సూచించారు. కేసులు పెరుగుతున్నాయని వైద్యశాఖ ప్రకటించడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయా సంస్థలు పేర్కొన్నాయి. మాస్కు ధరించకపోతే ఫైన్ల రూల్‌ను ఇంప్లిమెంట్ చేస్తారా? లేదా? అన్నది మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.

వర్క్ ఫ్రమ్ హోంపై సందిగ్ధత

ఐటీ కంపెనీలన్నీ ఏసీ రూమ్‌లు, క్యాబిన్లను కలిగి ఉండటంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మిగతా కార్యాలయాలతో పోల్చితే ఇక్కడ అధికశాతం కేసులు రికార్డు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం అంశంపై ఐటీ సంస్థల్లో చర్చలు జరుగుతున్నాయి. కేసులు పెరిగితే గతంలోని మాదిరిగానే వర్క్​ఫ్రమ్​ హోం అమలు చేసేందుకు కొన్ని ఐటీ సంస్థలు సుముఖంగా ఉన్నాయి. వైద్యశాఖ సూచించిన ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనలను తప్పకుండా అమలు చేయనున్నట్లు ఓ సంస్థ మేనేజర్ 'దిశ'కు తెలిపారు.

వైరస్ తీవ్రతను బట్టి

కేసులు తీవ్రత, వ్యాప్తి రేట్ ఆధారంగా బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లలో కరోనా రూల్స్ అమలుపై సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పాజిటివ్ రేట్ ప్రకారం కేవలం జనాలు గూమికూడే ప్రదేశాలు, కార్యాలయాల్లో మాస్కు నిబంధనను పాటిస్తే సరిపోతుందని అధికారులు సూచిస్తున్నారు. చలాన్ల విషయంలో మాత్రం సర్కార్ తీసుకోవాల్సిన నిర్ణయమేనని ఓ అధికారి చెప్పారు.

స్కూళ్లకూ ఆదేశాలు

పదేళ్ల లోపు చిన్నారులు బయటకు రావొద్దని వైద్యశాఖ ఇప్పటికే అప్పీల్ చేసింది. అత్యవసరం అయితే తప్పా తల్లిదండ్రులు పర్యవేక్షణలోనే బయటకు వెళ్లాలని సూచించింది. మరోవైపు స్కూళ్లకు వెళ్లే పిల్లలు కొవిడ్ రూల్స్ పాటించే బాధ్యత యాజమాన్యాలదేనని వైద్యశాఖ నొక్కి చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో కొవిడ్ నిబంధనలు అమలు అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వైద్యశాఖ స్పష్టం చేస్తున్నది.

కేసులు పెరుగుతున్నాయ్, మాస్కు ధరించాల్సిందే: డీహెచ్

గత 15 రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల ఉన్నది. అర్బన్ ప్రాంతాల్లో సర్జ్ కనిపిస్తున్నది. మాస్కును తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం ఏర్పడింది. ఇది మాత్రమే కొవిడ్ నుంచి రక్షణ కల్పిస్తుంది. నిర్లక్ష్యం తగదు. ఒకేచోట ఎక్కువ మంది గూమికూడే కార్యాలయాలు, సంస్థల్లో కొవిడ్ రూల్స్ పాటించాలని ఆదేశాలిచ్చాం. ప్రజలు కూడా మరిన్ని రోజులు సహకరించాలి. కేసులు పెరుగుదలను మరో వేవ్ ప్రారంభంగానే భావించవచ్చు. అయితే, మొదటి మూడు వేవ్‌ల తరహాలో మాత్రం కేసులు తీవ్రత ఉండదని వైద్యశాఖ ఎపిడమాలజీ బృందం అంచనా వేసింది. ప్రజలెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ టీకాలు పొందనోళ్లు వెంటనే సర్కారీ పీహెచ్‌సీలకు వెళ్లి తీసుకోవాలి. అన్ని ఆసుపత్రుల్లో చికిత్సకు అవసరమైన సదుపాయాలను కల్పించాం. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్​రావులు ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ సౌకర్యాలను కల్పిస్తున్నారు.



Next Story