విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు: మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

by Disha Web Desk 19 |
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు: మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సామాన్యులు కూడా ఉన్నత విద్యావంతులు అయ్యేలా విద్యారంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సెయింట్ థామ‌స్ హైస్కూల్ లో నిర్వహించిన అభినంధ‌న కార్యక్రమంలో మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చ‌దివి టెన్త్ ఫ‌లితాల్లో అత్యుత్తమ ప్రతిభ క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌ను మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి శాలువాతో సత్కరించి, ప్రశంస ప‌త్రాల‌ను అంద‌జేసి... వారిని అభినందించారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధికారులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఈ సంద‌ర్భంగా అభినందన‌లు తెలియ‌జేశారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠ‌శాల‌లు, కళాశాలలో చదివి కార్పొరేట్‌కు ధీటుగా మార్కులు సాధించడంపై ప్రశంసల కురిపించారు.

ప్రభుత్వ కళాశాల్లో నాణ్యమైన విద్య అందుతుందనడానికి ఇదే చక్కటి నిదర్శనమన్నారు. ఉమ్మడి పాల‌న‌లో ఆదిలాబాద్ జిల్లా విద్యా రంగంలో చాలా వెనుక‌బ‌డి ఉండేద‌ని, స్వరాష్ట్రంలో చదువుకు పేదరికం అడ్డురాకూడదని, హక్కుగా చదువుకోవాలనే వాతావరణం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి చదువుకునే అవకాశం కల్పించామని, ఒకటో తరగతి నుంచి పీజీ వ‌ర‌కు నాణ్యమైన విద్యా బోధ‌న అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు 'మన ఊరు -మన బడి' కార్యక్రమాన్ని చేపట్టామ‌న్నారు. ఇంట‌ర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెండో స్థానంలో.. ప్రథమ సంవత్సరంలో మూడో స్థానంలో నిలిచింద‌ని, టెన్త్ ఫ‌లితాల్లో నిర్మల్ జిల్లా రెండ‌వ స్థానం సాధించ‌డం చాలా గొప్ప విష‌య‌మ‌న్నారు. ఇది సమిష్టి కృషి వ‌ల్లే సాధ్యమైంద‌ని, రానున్న రోజుల్లో నిర్మల్ జిల్లాను ప్రథ‌మ స్థానంలో నిలిపేందుకు మరింత కష్ట పడి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో క‌లెక్టర్ ముశ్రఫ్ అలీ ఫారూఖీ, డీఈవో ర‌వీంద‌ర్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed