మునుగోడు సభకు వెంకట్ రెడ్డి వస్తున్నారు.. రేవంత్ రెడ్డి క్లారిటీ

by Disha Web Desk 2 |
మునుగోడు సభకు వెంకట్ రెడ్డి వస్తున్నారు.. రేవంత్ రెడ్డి క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తనకు మధ్య అగాధం సృష్టించేందుకు కొంత మంది టీవీ ఛానల్ యాజమాన్యంలో పని చేస్తున్న ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన వ్యాఖ్యల పట్ల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో రేవంంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను మాట్లాడిన మాటలు వెంకట్ రెడ్డి గురించి కాదని, ఆయన గౌరవాన్ని తగ్గించేలా ఎప్పుడు మాట్లాడలేదని అన్నారు. నేను మాట్లాడిన మాటల్లో కేవలం రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించినవి మాత్రమే అని అన్నారు. శుక్రవారం ఈ విషయంలో స్పందించిన రేవంత్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ద్రోహి అని వ్యాపారాల కోసం పార్టీ మారాడు ఆరోపించారు. తనపై రాజగోపాల్ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ రోజు చండూరుకు వస్తున్నానని చెప్పారు. చండూరు చౌరాస్తాలో బహిరంగ చర్చకు నేను సిద్ధం అని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి ఈ స్థాయికి ఎలా ఎదిగావో.. నీకు కాంట్రాక్ట్‌లు ఎలా వచ్చాయో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.

నీకన్నా నాకే అనుభం ఎక్కువ:

గత ఎనిమిది సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం మీద కనీసం రాజగోపాల్ రెడ్డి పోరాడలేదని విమర్శించారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఇంతటి స్థాయిలో ఉన్నాడంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని, రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ వల్లనే అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే రాజగోపాల్ రెడ్డి బ్రాందీ షాప్‌లో కూడా పని చేయడానికి పనికి రాడంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసినందుకు తనమీద 80 కేసులు నమోదు అయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వంపై నీవు ఏం మాట్లాడావు? నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలన్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నావని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని తిట్టడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూడవద్దని.. నీకన్నా రాజకీయంలో నాకే అనుభవం ఎక్కువ ఉందన్నారు.

వెంకట్ రెడ్డి వేరు.. రాజగోపాల్ రెడ్డి వేరు:

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటన అనంతరం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తనను అనవసరంగా రెచ్చగొట్టవద్దని వెంటనే క్షమాపణలు చెప్పాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందించారు. సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం కోమటిరెడ్డి బలంగా పనిచేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా వెంకట్ రెడ్డి పార్టీకి అనేక సేవలు చేశారని, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన కూడా పాల్గొంటారని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేరు వెంకటరెడ్డి వేరని తాను చేసిన వ్యాఖ్యలు వెంకట్ రెడ్డిని ఉద్దేశించి కాదని క్లారిటీ ఇచ్చారు.


Next Story

Most Viewed