కోమటిరెడ్డి సోదరులకు చెక్.. రేవంత్ రెడ్డి అదిరిపోయే వ్యూహం..!!

by Disha Web |
కోమటిరెడ్డి సోదరులకు చెక్.. రేవంత్ రెడ్డి అదిరిపోయే వ్యూహం..!!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ ఇమేజ్.. నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా ఉండేది. జిల్లా కాంగ్రెస్‌లో ఆ బ్రదర్స్ ఏం చెబితే.. అదే వేదంగా మారేది. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి తదితర ఉద్ధండ నేతలు ఉన్నా.. కోమటిరెడ్డి బ్రదర్స్(వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి)దే హావా. వీరి హావాకు తగ్గట్టుగానే వర్గపోరులో ఈ బ్రదర్స్‌దే పైచేయి. కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి చేరేందుకు రెడీ అవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇన్నాళ్లూ కోమటిరెడ్డి బ్రదర్స్‌ను భుజస్కంధాలపై పెట్టుకుని మోసి సొంత పార్టీ శ్రేణులు సైతం బ్రదర్స్ తీరుతో డైలామాలో పడ్డట్టు అయ్యారు. అయితే ఈ వ్యుహామంతా కోమటిరెడ్డి బ్రదర్స్‌ కోసం చెక్ పెట్టడంలో భాగమనే వాదన జోరుగా విన్పిస్తుండడం గమనార్హం.

రేవంత్ వ్యుహామేనా..

యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఒక ఎత్తయితే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ మాత్రం అందుకు భిన్నమనే చెప్పాలి. టీపీసీసీ అధ్యక్షుడైనా.. స్టేట్ ఇన్‌చార్జి అయినా నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అనుమతి లేనిదే.. చిన్న సమావేశం సైతం పెట్టలేరనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తలపెట్టిన సన్నాహాక సభ విషయంలోనూ నల్లగొండ జిల్లాలోకి రేవంత్ రెడ్డిని రాకుండా అడ్డుకోవడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ సక్సెస్ అయ్యారనే సంగతి తెలిసిందే. పార్టీ అధిష్టానం సన్నాహాక సమావేశం ఏర్పాటు కోసం సీనియర్ నేతలను రాయబారానికి పంపినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ససేమిరా అనడంతో రేవంత్ సమావేశం పెట్టకుండానే వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత తర్వగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చెక్ పెట్టకపోతే.. తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందనే టాక్ అప్పట్లో బహింగంగానే విన్పించింది. ఇదే సమయంలో గత కొంతకాలంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మధ్య సఖ్యత కొరవడింది. దీనికితోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరతామనే ప్రకటన చేయడంతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరుకునపడిపోయారు. రాజీనామా వ్యవహారంపై స్పందిస్తూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్‌పై ఘాటుగా స్పందించడంతో ఎంపీ వెంకటరెడ్డి సైతం ఘాటుగానే రిప్లై ఇవ్వడంతో వివాదం ముదిరింది.

చెరుకు ఎంట్రీతో చెక్ పడ్డటేనా..

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ప్రెషర్ పెరిగిపోయింది. నిజంగా ఉపఎన్నిక వస్తే.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేయగలడా..? అసలు కాంగ్రెస్‌లో కొనసాగుతారా..? ఆయన కండువా మారుస్తారా.? అన్న అనుమానాలు కాంగ్రెస్ శ్రేణుల్లోనే ఎక్కువవయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుహ్యంగా తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారిపోయింది. చాలా ఏండ్లుగా చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లోకి రాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వెంకటరెడ్డికి సమాచారం లేకుండానే రేవంత్ రెడ్డి ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలోకి చేర్చుకుని సంచలనానికి తెర తీశారు. వాస్తవంగా చెప్పాలంటే.. ఓవైపు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం.. మరోవైపు చెరుకు సుధాకర్ ఎంట్రీ కావడంతో కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స బ్రాండ్ ఇమేజీ డ్యామేజ్ అయ్యిందనే చెప్పాలి. వెంకటరెడ్డి సైతం చెరుకు సుధాకర్‌ను చేర్చుకున్నందుకు నిరసనగా మునుగోడు ఉపఎన్నిక అయ్యేంత వరకు తాను అక్కడికి రానంటూ ప్రకటించడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ బ్రదర్స్ సెల్ఫ్ గోల్‌లో పడిపోవడం.. రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఆధిపత్యానికి చెక్ పెట్టడం ఒకేసారి జరిగాయంటూ చర్చించుకోవడం విశేషం.

కార్యకర్తల్లోనూ పెరిగిపోతున్న అసహనం

నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చెబితే.. కాంగ్రెస్ శ్రేణులు అదే ఫాలో అవుతూ వచ్చారు. కానీ ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్ తీరును బహిరంగంగానే తప్పుపడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చినా.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండుసార్లు అధికారాన్ని కోల్పోయింది. అయినా కోమటిరెడ్డి బ్రదర్స్ తమ ఇమేజ్ కోసం పార్టీని బలోపేతం కాకుండా కొంతమంది నేతలను పార్టీలోకి రాకుండా అడ్డుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు ఎలాంటి సంబంధం లేని తుంగతుర్తి నియోజకవర్గంలో వడ్డెపల్లి రవిని స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా చేర్చుకున్నారు. మరీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తుండటం గమనార్హం.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed