హోంమంత్రిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్.. దానిని నిలిపివేయాలని వినతి!

by Disha Web Desk 19 |
హోంమంత్రిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్.. దానిని నిలిపివేయాలని వినతి!
X

దిశ, అంబర్ పేట్: జర్నలిస్టుల వాహనాలపై ఉన్న ప్రెస్ స్టిక్కర్లను పోలీసులు తొలగించడం నిలిపివేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్( టీడబ్ల్యూజేఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య ఆధ్వర్యంలో హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ రంగనాథ్‌లను కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జంట నగరాల్లో ఇటీవల పోలీసులు.. ప్రెస్ స్టిక్కర్స్‌పై జర్నలిస్టులకు చలాన్స్ విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ, ప్రెస్ నాలుగు స్తంభాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టులు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్న సమాజంలో సామాజిక, ఆర్థిక మార్పులను తీసుకురావడానికి కీలకమైన పాత్ర పోషిస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు.

ఫోర్త్ ఎస్టేట్‌లకు రాజ్యాంగం సొంత గుర్తింపును కల్పిస్తుందని, పాత్రికేయులు తమ వాహనాలకు ప్రెస్ అనే స్టిక్కర్స్ పెట్టుకోవడం వారి వృత్తి నైతికతకు, ఉన్నత ప్రమాణాలకు గౌరవంగా భావిస్తారన్నారు. పోలీసు అధికారులు జర్నలిస్టుల వాహనాలపై "ప్రెస్" అనే నేమ్ ప్లేట్‌ను తొలగించి అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులు ప్రెస్ స్టిక్కర్ ను వాహనాలకు పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో వర్కింగ్ జర్నలిస్టులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. నకిలీ జర్నలిస్టులను తొలగించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న నిజమైన జర్నలిస్టులను అవమాన పరుస్తున్నారని ఆరోపించారు.

హోంమంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ.. ఈ విషయంపై పోలీస్ అధికారులతో మాట్లాడి నిజమైన జర్నలిస్టులకు సహకరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. నకిలీ జర్నలిస్టుల ఏరివేత కోసమే వాహనాలపై ప్రెస్ స్టిక్కర్ల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని చెప్పారు. అక్రిడేషన్ కార్డు, గుర్తింపు పొందిన మీడియా సంస్థల ఐడీ కార్డు ఉండాలని సూచించారు. జర్నలిస్టులు కానివారంతా తమ వాహనాలకు ప్రెస్ స్టిక్కర్స్‌ను వెంటనే స్వచ్చందంగా తొలగించుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవపున్నయ్యతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ఆనందం, కోశాధికారి ఆర్. వెంకటేశ్వర్లు, విజయానందరావు పాల్గొన్నారు.

Next Story

Most Viewed