ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం పై తప్పుడు ప్రచారం: రాంచందర్ రావు

by Jakkula.Mamatha |

ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు.

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం పై తప్పుడు ప్రచారం: రాంచందర్ రావు
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. మంగళవారం భువనగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం దిగుబడుల అంచనాలను సరిగ్గా రూపొందించడంలో ప్రభుత్వం విఫలమవడంతో పాటు కేంద్రానికి సరైన ఇండెంట్ కూడా పంపలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించదని, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రం రీయింబర్స్‌మెంట్ అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కేంద్రం సేకరించిన ధాన్యంలో దాదాపు 50 శాతం తెలంగాణ నుంచే కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కొనుగోలు ప్రక్రియలో ఏర్పడిన సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మూసి ప్రక్షాళన ప్రాజెక్టులు రేవంత్ రెడ్డికి ఏటీఎంలుగా మారాయని ఆరోపించారు. మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకే తమ అభ్యంతరమని స్పష్టం చేశారు. బీజేపీ నాయకుల పై ముఖ్యమంత్రి అనవవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసే వరకు బీజేపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కేసీఆర్‌ను కాపాడేందుకే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.

Next Story