క్రిప్టో ఎక్స్ఛేంజ్ వజీర్ ఎక్స్ బ్యాంకు ఖాతాను జప్తు చేసిన ఈడీ!

by Disha Web Desk 17 |
క్రిప్టో ఎక్స్ఛేంజ్ వజీర్ ఎక్స్ బ్యాంకు ఖాతాను జప్తు చేసిన ఈడీ!
X

న్యూఢిల్లీ: ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ సంస్థ వజీర్ఎక్స్‌ను నిర్వహించే జన్మయి ల్యాబ్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించినట్టు వెల్లడించింది. సంస్థ కార్యకలాపాల్లో పలు అవకతవకలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో వజీర్ ఎక్స్ బ్యాంకు ఖాతాల్లోని రూ. 64.67 కోట్ల నిధులను జప్తు చేసినట్టు సంబంధిత అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ‌జీర్ ఎక్స్ మాతృసంస్థ జ‌న్మయి ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రైన సమీర్ కార్యాలయంతో పాటు ఆయన ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా లోన్ యాప్స్‌తో వజీర్ఎక్స్‌కు సంబంధాలున్నాయనే అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

గత కొంతకాలంగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న లోన్ యాప్ నిర్వాహకులు వజీర్ ఎక్స్ నుంచి క్రిప్టో కరెన్సీని కొన్నట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. క్రిప్టో ద్వారా వీరు సొమ్మును విదేశాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ లోన్ యాప్స్ నిర్వహణకు సంబంధించి కొన్ని ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు సైతం ఉన్నట్టు ఈడీ విచారణలో బయటపడింది. పలు ఎన్‌బీఎఫ్‌సీలు రూ. 4 వేల కోట్లకు పైగా లోన్ యాప్స్ నుంచి రుణాలిచ్చినట్టు సమాచారం. అధిక వడ్డీ రూపంలో సుమారు రూ. 800 కోట్లకు పైగా లాభాలను ఆర్జించినట్టు, ఈ మొత్తాలను వజీర్ ఎక్స్‌లో పెట్టుబడిగా పెట్టి, అనంతరం విదేశాలకు బదిలీ చేసినట్లు ఈడీ తనిఖీల్లో స్పష్టమైంది.


Next Story