TRSలో 'మహా' సంక్షోభం చిచ్చు.. కేసీఆర్‌పై తిరుగుబాటు చేస్తే పరిస్థితేంటి?

by Disha Web Desk 4 |
TRSలో మహా సంక్షోభం చిచ్చు.. కేసీఆర్‌పై తిరుగుబాటు చేస్తే పరిస్థితేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే సర్కార్ పై సొంత పార్టీ నేతల తిరుగుబాటు తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపురెండున్నరేళ్ల పాటు కొనసాగిన సంకీర్ణ ప్రభుత్వానికి బీటలు వారాయి. ఏ క్షణంలోనైనా ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కుప్పకూలుతుందనే వార్తలతో దేశ ఆర్థిక రాజధానిలో అసలేం జరుగుతోందనే దానిపై మిగతా రాష్ట్రాలు ఫోకస్ పెట్టాయి. ఉద్దవ్ ఠాక్రే సర్కార్ పై అసమ్మత్తి రాగం ఆలపిస్తున్న సొంత పార్టీకి చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండే వర్గానికి క్రమంగా మద్దతు పెరగడం సంచలనం అవుతోంది. తాము తిరుగుబాటు ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని గురువారం ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు. ఉద్దవ్ ఠాక్రే తీరును ఎండగడుతూ ఏకంగా మూడు పేజీల లేఖ రాశారు. ఏక్ నాథ్ షిండే ఏ కారణాలను అయితే ప్రస్తావించారో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా అలాంటి విమర్శలే రావడం మరింత ఆసక్తిని రేపుతోంది. దీంతో ఏక్ నాథ్ షిండే తరహాలో సీఎం కేసీఆర్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే పరిస్థితి ఏంటన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

ఉద్దవ్ పరిస్థితే కేసీఆర్‌కు వస్తుందా?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ను ఉద్దేశించి తిరుగుబాటు దారులకు నేతృత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే ఓ లేఖను రాశారు. ఇందులో సీఎం ఉద్దవ్ ఠాక్రే ఎమ్మెల్యేలకు సైతం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. సొంత ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. అపాయింట్ మెంట్ కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇన్నాళ్లూ తెరుచుకోని సీఎం ఇంటి తలుపులు తాము నిరసన గళం విప్పగానే తెరుచుకున్నాయని ఎద్దేవా చేశారు. కొంతమందిని పక్కన పెట్టుకుని అనైతికమైన రాజకీయం నడుపుతున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఏక్ నాథ్ షిండే. ఈ మాటలే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో రచ్చ రేపుతున్నాయి. సీఎం కేసీఆర్ విషయంలోనూ ఇదే తరహా విమర్శలు వస్తున్నాయి. గతంలో ఈటల రాజేందర్ పార్టీకి రాజీనామా చేసిన సమయంలో ఏక్ నాథ్ షిండే ఎలాంటి మాటలైతే ప్రస్తావించారో ..అలాంటి కామెంట్సే చేశారు.

సీఎం కేసీఆర్ సొంత మంత్రులకు గౌరవం ఇవ్వడం లేదని, కనీసం మంత్రులుగా కాకపోయినా మనుష్యులుగానైనా చూడాలని తాము కోరుకున్నామని చెప్పారు. అనేకమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్ విషయంలో అసంతృప్తితో రగిలిపోతున్నారని, తాను బయటకు వచ్చి మాట్లాడుతున్నానన్నారు. మిగతా వారు అక్కడే ఉండి మౌనంగా ఉండిపోయారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ వద్ద ఆత్మగౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు అయితే సీఎం కేసీఆర్ ను ఏకంగా ప్రగతి భవన్, ఫామ్ హౌస్ సీఎం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకే సీఎం కేసీఆర్ అందుబాటులో ఉండటం లేదని, ఇక ప్రజల సమస్యలను ఏం వింటారని దెబ్బిపొడుస్తున్నాయి. సామాన్యులకు ప్రగతి భవన్ తలుపులు తెరుచుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి.

టీఆర్ఎస్ లో తిరుగుబాటు వస్తే పరిస్థితి ఏంటి?

ఏ పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా తిరుగుబాటు వస్తే దాన్ని కంట్రోల్ చేయడం అంత సులువైన పని కాదు. తాజాగా మహారాష్ట్రలోనూ అదే జరుగుతోంది. తొలుత 11 మంది ఎమ్మెల్యేలే షిండే వైపు ఉన్నారనే వార్తలు వచ్చాయి. కానీ అసమ్మతి వర్గానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ప్రస్తుతం 40 మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే పక్షంలో చేరిపోయినట్లు తెలుస్తోంది. తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇదుగో చేస్తాం అదిగో చేస్తామని సీఎం చేస్తున్న ప్రకటనలపై అంతర్గతంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర నిరాశ నెలకొందట. 2014లో ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనేక మంది టీఆర్ఎస్ ను వీడారు. ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి పని చేసిన వారంతా ఆయనపై మండిపడుతున్నారు. పైకి ఎవరూ చెప్పకపోయినా కేసీఆర్ చేస్తున్న అసంబద్దమైన ప్రకటనలు తమ రాజకీయ భవిష్యత్ ను నిలువునా పాతరేస్తాయనే అభిప్రాయం మెజార్టీ ఎమ్మెల్యేల్లో నెలకొందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీలో కేసీఆర్ వర్గం, కేటీఆర్ వర్గంతో పాటు ఉద్యమకారులు, వలుసదారులు అనే ట్యాగ్ లైన్లు కండువాతో పాటు నేతల మెడల్లో వేళాడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ సొంత పార్టీ నేతలకు మరింత అందుబాటులో ఉండాలనే టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం అందుబాటులో ఉండకుంటే మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే తెలంగాణలోనూ ఆవిష్కృతమయ్యే అవకాశాలు ఉంటాయనే మాట రాజకీయ పండితుల నుండి వినిపిస్తోంది.


Next Story

Most Viewed