దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనే.. సంకేతాలిచ్చిన కేటీఆర్

by Web Desk |
దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనే.. సంకేతాలిచ్చిన కేటీఆర్
X

దిశ ప్రతినిధి, సిద్దిపేట: దుబ్బాకలో ఎన్నికల కోలాహలం ఏడాదిన్నర ముందుగానే షురూ అయ్యింది. సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం తర్వాత అధికార టీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థి గెలిచిన మరుక్షణం నుండే టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా అధికార టీఆర్ఎస్ నుండి ఎవరు పోటీలో నిలబడతారనే చర్చ గత కొంత కాలంగా సాగుతుంది.

తాజాగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మెదక్ ఎంపీయే కాబోయే మీ ఎమ్మెల్యే అంటూ సంకేతాలిచ్చారు. దీనిపై దుబ్బాక నియోజకవర్గం అంతా చర్చ జరుగుతుంది. కొంత మంది మెదక్ ఎంపీ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలపగా మరికొంత మంది వద్దని వారిస్తున్నట్టు సమాచారం. ఇంకొందరు తమకు టికెట్ కేటాయించాలని కోరుతున్నారని వినికిడి. ఇదిలా ఉండగా మాజీ దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుటుంబానికి భరోసా ఇచ్చిన టీఆర్ఎస్ వారికి ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతుందనే చర్చ సైతం దుబ్బాకలో జోరుగా సాగుతోంది.

"కొత్త" వైపే మొగ్గు..

దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా గులాబీ అధిష్టానం కొత్త ప్రభాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు అనధికార సమాచారం. దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరుతూ దుబ్బాక పట్టణ కౌన్సిలర్ల బృందం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ని శనివారం కలిశారు. దుబ్బాక మున్సిపల్ స్థితిగతులను తెలుసుకున్న కేటీఆర్ రూ.20 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

అదే విధంగా మీకు అన్ని విధాలా మెదక్ ఎంపీ ఉన్నాడు.. తానే మీ ఎమ్మెల్యే అంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సైతం దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గెలిచినప్పటి నుండి దుబ్బాక నియోజకవర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇటీవల సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ సిద్దిపేట అధ్యక్షునిగా నియమించడం అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

తెరపైకి మరికొంత మంది నాయకులు..

దుబ్బాక టీఆర్ఎస్ స్థానాన్ని ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఇటీవల కేటీఆర్.. కేపీఆర్ పేరును వినిపించడంతో తెరపైకి పలువురి పేర్లు వినబడుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో పలువురు నేతలు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం వారంతా దుబ్బాక ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు.

వారిలో ప్రధానంగా 2018 లో ఎన్నికల్లో టీజేఎస్ అభ్యర్థి గా పోటీ చేసిన చిన్నం రాజ్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మద్దుల నాగేశ్వర్ రెడ్డి, 2008 లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మనోహర రావు, 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి పాటు మరికొందరు నేతలు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో కొంత మంది సిద్దిపేట మంత్రి హరీశ్ రావును కలిసి తమకే టికెట్ కేటాయించాలని కోరినట్టు సమాచారం.

సోలిపేట కుటుంబానికి నిరాశేనా..?

మాజీ దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం తర్వాత సోలిపేట కుటుంబ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. రామలింగారెడ్డి మరణం తర్వాత ఏర్పడిన ఉప ఎన్నికల్లో దుబ్బాక టీఆర్ఎస్ టికెట్ వారి సతీమణి సోలిపేట సుజాతకు కేటాయించారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డి కుటుంబాన్ని పూర్తిగా టీఆర్ఎస్ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అయినా స్వల్ప ఓట్ల తేడాతో సోలిపేట సుజాత ఓడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా సోలిపేట కుటుంబానికి టీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీనిచ్చారు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత సోలిపేట కుటుంబం ఎక్కడ కూడా కనిపించడం లేదు. రామలింగారెడ్డి కుమారుడు సతీష్ పలు సందర్భాల్లో కనిపించినప్పటికి పొలిటికల్గా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఇలాంటి వేళ అధికార టీఆర్ఎస్ తిరిగి దుబ్బాక ఎమ్మెల్యే టికెట్ ని సోలిపేట కుటుంబానికి కేటాయిస్తుందా లేక ఏదైనా నామినేటెడ్ పదవితో సరిపెడుతుందా .. ఎలాంటి హామీ ఇవ్వబోతుందనేది తెలియాల్సి ఉంది. లేక రాజకీయాలకి పూర్తిగా దూరం పెడుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. మొత్తానికి దుబ్బాకలో ఎన్నికల సందడి మొదలైనట్టే కన్పిస్తుంది.

Next Story

Most Viewed