రాజకీయాలంటే స్విమ్మింగ్ ఫూల్‌లో అమ్మాయిలతో కులకడం కాదు

by Disha Web |
రాజకీయాలంటే స్విమ్మింగ్ ఫూల్‌లో అమ్మాయిలతో కులకడం కాదు
X

దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేశ్‌వి పిల్ల రాజకీయాలు, పిల్ల చేష్టలు అంటూ మండిపడ్డారు. నేను నిజంగానే అరాచకాలు చేసేవాడిని అయితే ప్రజలు నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపిస్తారు. అరాచకాలు, ఫ్యాక్షన్‌ చేసే వ్యక్తిని టీడీపీ మాచర్ల నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా పెట్టింది చంద్రబాబే అని ఆరోపించారు. సొంత కుటుంబ సభ్యుల్ని దారుణంగా హతమార్చిన కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి బ్రహ్మారెడ్డి. అలాంటి వ్యక్తిని పక్కనపెట్టుకుని నాపైన విమర్శలా? ఇలాంటి ఉడత ఊపులకు పల్నాడులో ఎవరూ భయపడరు.

లోకేశ్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. గుడ్డ కాల్చి మా మీద వేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు. లోకేష్‌ అవాస్తవాలు మాట్లాడటం కాదు, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. జల్లయ్య అనే వ్యక్తి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 10కేసుల్లో ముద్దాయి. మా పార్టీకి సంబంధించి వ్యక్తిని చంపితే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాలతో మాట్లాడి, గొడవలు వద్దని నేనే రాజీ చేశాను. జనవరి 24, 2022న ఆ కేసును కొట్టేయడం కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే బ్రహ్మారెడ్డిని మాచర్ల టీడీపీ ఇన్‌‌చార్జ్‌గా పంపించారో, అప్పటి నుంచి పాత ఫ్యాక్షన్‌ను బయటకు తీస్తూ గొడవలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

లోకేశ్ ఒక జోకర్

శుభ కార్యానికి, పరామర్శకు అర్థం తెలియని లోకేష్.. పల్నాడులో పరామర్శ పేరుతో వచ్చి, నాలుగు దండలు వేసుకుని, నుదుట పెద్ద తిలకం బొట్టు పెట్టుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. పల్నాడులో ఏం జరుగుతుందో, అసలు పల్నాడు చరిత్ర ఏమిటో నారా లోకేశ్‌కు తెలుసా? అని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. లోకేశ్ మొహం చూస్తుంటే.. నిరాశ, నిస్పృహలు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు. 'చంద్రబాబు నాయుడు కొడుకుగా పల్నాడుకు వచ్చిన లోకేశ్ మీసాలు మెలేసి, తొడలుకొట్టి, డైలాగులు చెబుతుంటే రాష్ట్ర ప్రజలందరికీ సినిమాల్లో హాస్యనటుడు బ్రహ్మానందం, కిల్‌బిల్‌ పాండే పాత్ర పోషించినట్లుగా ఉంది. లోకేష్ వీరుడు కాదు ఒక జోకర్. హతుడు జల్లయ్య గురించి నారా లోకేశ్‌కు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నాం. 2014-19లో మీ నాన్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే జల్లయ్యపై పది కేసులు నమోదు అయ్యాయి. అలాంటి వ్యక్తి వారి వ్యక్తిగత గొడవల్లో హత్యకు గురైతే, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చావు. నువ్వు, నీ తండ్రి మాచర్ల నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌‌చార్జ్‌గా పంపించిన బ్రహ్మారెడ్డి నేర చరిత్ర గురించి నీకు తెలుసా లోకేశ్?' అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిలదీశారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మూడు సీట్లు కూడా రావు

రాజకీయాలంటే, ఆఫ్‌ నిక్కర్లు వేసుకుని విదేశాల్లో స్విమ్మింగ్‌ఫూల్‌లో అమ్మాయిలతో కులకడం అనుకుంటున్నావా...? నీ పక్కన కూర్చోబెట్టుకున్న బ్రహ్మారెడ్డి తల్లి 2019లో ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే, ఆమె సొంత మండలంలో 15 ఫ్యాక్షన్‌ మర్డర్స్‌ జరిగాయి. అలాంటి ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న వ్యక్తి బ్రహ్మారెడ్డిని నీవు పక్కన కూర్చోబెట్టుకుని ఫ్యాక్షన్ గురించి, హత్యా రాజకీయాల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఏడుగురుని హతమార్చిన కేసులో బ్రహ్మారెడ్డి ఏ1 ముద్దాయి. సొంత బాబాయ్‌ని చంపిన కేసులో ఏ1గా ఉన్నాడు. సొంత కొడుకును చంపిన కేసులో ఏ1 ముద్దాయి బ్రహ్మారెడ్డి. పల్నాడులో ఫ్యాక్షన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ బ్రహ్మారెడ్డి. అలాంటి పరిస్థితుల్లో ఫ్యాక్షన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న బ్రహ్మారెడ్డిని, మాచర్లకు పంపించి తండ్రీకొడుకులు మళ్ళీ ఇక్కడ నిప్పు రాజేసి గొడవలు పెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే 2019లో 23 సీట్లు వచ్చిన టీడీపీకి ఈసారి ఎన్నికల్లో మూడు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

మీరు గ్రామ సింహాలే

మా బయోడేటాలోనే భయం లేదని చెబుతున్న లోకేశ్‌ అసలు మీకు బయోడేటా ఉందా అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. బయోడేటా ఉంటే లోకేశ్, చంద్రబాబులు బయటపెట్టాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీని, జెండాను దొంగలించిన దొంగలు మీరు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆ‍స్తులను దొంగలించిన మీరు. ఇదే మీ అసలైన బయోడేటా అని ఎద్దేవా చేశారు. అసలు లోకేష్‌ బుర్రలో డేటా అనేది ఏమైనా ఉందా? లోకేశ్‌కు అమరావతిలో ఆధార్‌ కార్డే లేదు. నువ్వు, నీ తండ్రి హైదరాబాద్‌ నుంచి అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చిపోయే టూర్టిస్ట్‌లు, అటువంటి మీరా మా గురించి మాట్లాడేది?అంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో రాయలసీమ పౌరుషం చూపించేది సింహం లాంటి సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. అదే రాయలసీమలో పుట్టిన మీ తండ్రీకొడుకులు గ్రామ సింహాలు మాత్రమే. ఈ విషయాన్ని లోకేశ్ గుర్తుపెట్టుకుంటే మంచిది అని హితవు పలికారు.నీ పిల్ల చేష్టలు, నీ ఆఫ్ నాలెడ్జి రాజకీయాలు ఉంటే.. నీ కొడుకు దేవాన్ష్‌కు చెప్పుకో.. పల్నాడు ప్రజలకు కాదు అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

ఫ్యాక్షన్ ను రాజేయాలని చూస్తే ఉపేక్షించం..

ఫ్యాక్షన్‌ రాజకీయాలను మళ్లీ ప్రోత్సహించి పల్నాడును అల్లకల్లోలం చేయాలని చూస్తే.. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని సీఎం జగన్‌ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. సింహంలాంటి జగన్‌‌ని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుందో అదే పరిస్థితి లోకేశ్‌కు ఎదురౌతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పల్నాడు ప్రాంతంలో అడుగు పెట్టేడప్పుడు ఒళ్లు, నోరు అదుపులో పెట్టుకుని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed