నగరంలో అవి లేని గోదాములు కోకొల్లలు.. ప్రమాదం జరిగాక పోలీసులు అప్రమత్తం

by Dishanational1 |
నగరంలో అవి లేని గోదాములు కోకొల్లలు.. ప్రమాదం జరిగాక పోలీసులు అప్రమత్తం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కోటి మందికి పైగా జనాభా ఉండే హైదరాబాద్ మహా నగరంలో నిత్యం వేల టన్నుల చెత్త వెలువడుతోంది. దీనితో పాటు ఇంట్లో పాత సామాన్లు, ఇతర స్క్రాప్ సామాగ్రి ఉండిపోతుంటుంది. అయితే, వీటిని కొనేందుకు కాలనీల్లో తిరుగుతూ పలువురు స్క్రాప్ వస్తువులను సేకరింస్తుంటారు. ఇలా సేకరించిన వాటిని గోదాముల్లోకి చేర్చి, అన్నింటిని వేరు చేస్తూ ఉంటారు. కానీ, ఇలాంటి స్క్రాప్ దుకాణం ఏర్పాటు చేయాలంటే నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాకుండా, పూర్తిగా తుక్కు సామాగ్రి ఉండటం వల్ల ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉండటం వల్ల నిర్వాహకులు ప్రమాద నివారణ యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇలా నగరంలో అనుమతుల్లోని, నిబంధనలు పాటించని స్క్రాప్ దుకాణాలు, గోదాములు వందలకొద్దీ ఉన్నాయి. ఇందులో ఎక్కువగా బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని వలస వచ్చే వారిని కార్మికులుగా చేర్చుకొని పెద్ద ఎత్తున స్క్రాప్ దుకాణాలు నిర్వహింస్తుంటారు. వీటిల్లో నిత్యం ఏదో చోట ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఇందులో ఎప్పుడైతే ప్రాణ నష్టం జరుగుతుందో ఆ సమయంలోనే పోలీసులు, అధికారులు స్క్రాప్ దుకాణాలపై దృష్టి పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

అదేవిధంగా.. సికింద్రాబాద్ బోయగూడలో బుధవారం తుక్కు గోదాములో జరిగిన అగ్ని ప్రమాదం నిద్రిస్తున్న 11 మందిని పొట్టన పెట్టుకుంది. దీంతో ఈ ప్రమాద ఘటన దేశవ్యాప్త చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళి అర్పించారు. అంతేగాకుండా, వారికి రూ.2 లక్షల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి. ప్రమాదం జరిగిన గోదాముకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. గోదాం విషయంలోనూ ఎలాంటి నిబంధనలు పాటించలేదని, గోదాంలో ప్రమాద నివారణ చర్యలు ఏమీ లేవని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే, ఇలా ప్రమాదం జరిగేవరకు టింబర్ డిపోలపై, తుక్కు గోదాములపై పోలీసులు, అధికారులు అప్రమత్తం అవ్వరా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం హైదరాబాద్‌లో నిబంధనలు పాటించని వందల కొద్ది తుక్కు గోదాములు ఉన్నాయని, వాటిపై దృష్టి సారించాలంటూ పోలీసులకు ట్విట్టర్ వేదికగా సూచిస్తున్నారు.

Next Story