బయట బోర్డు ఒకటి.. లోపల దందా మరోకటి.. పోలీసులు ఎంట్రీతో సీన్ రివర్స్

by Disha Web Desk 19 |
బయట బోర్డు ఒకటి.. లోపల దందా మరోకటి.. పోలీసులు ఎంట్రీతో సీన్ రివర్స్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఫైనాన్స్ అని తాటికాయంత అక్షరాలతో బోర్టులు ఏర్పాటు చేసుకుంటే చట్టాలకు పని చెప్తారు అధికారులు.. ఆ చట్టాలకు... అధికారులకు చిక్కకుండా తమ దందా మూడు నోట్లు ఆరు కరెన్సీ కట్టలుగా వర్థిల్లాలంటే ఏం చేయాలి అన్న ఆలోచనే వారి వ్యాపారాన్ని కొనసాగించేలా చేసింది. వడ్డీ వ్యాపారం చేయాలంటే అనుమతులు తీసుకుని ఇందుకు అనుగుణంగానే వడ్డీ వసూలు చేస్తే కోట్లకు పడగత్తలేమని భావించిన ఈ ఘనులు.. అటు చట్టాలకు చిక్కకుండా ఇటు అధికారుల కంట పడకుండా ఉండేందుకు భారీ స్కెచ్ వేశారు. వ్యాపారం పేరిట చేపట్టిన ఈ దందాలో అవసరాలు ఉన్న వారిని నిట్ట నిలువునా ముంచుతూ దందా కొనసాగిస్తున్నారు. బుధవారం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించడంతో వడ్డీ వ్యాపారులు గుట్టు రట్టయింది. వడ్డీ దందా కొనసాగించేందుకు వేరే వ్యాపారం చేస్తున్నట్టుగా ముందు బోర్టులు ఏర్పాటు చేసి లోన మాత్రం అక్రమ ఫైనాన్స్‌లు నిర్వహిస్తున్నారు. దీంతో అటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులు మిగలడంతో పాటు అధిక వడ్డీలు వసూలు చేసుకునే అవకాశం కూడా దొరికినట్టయింది. అంతే కాకుండా మరికొంత మంది తమ ఇళ్లలోనే అక్రమంగా ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా తేటతెల్లం అయింది.

పోలీసుల ప్రతి వ్యూహం..

ఇటీవల కాలంలో పోలీసులకు తరుచూ ఫైనాన్సర్లు అక్రమంగా వడ్డీ వసూళ్లు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువలా అందుతున్నాయి. దీంతో వడ్డీ దందాగాళ్ల భరతం పట్టాలని నిర్ణయించిన కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వడ్డీ వ్యాపారుల ఎత్తులకు పై ఎత్తు వేసి ప్రత్యేక నిఘా వేశారు. వ్యాపారులు చేస్తున్న దందా తీరుతో పాటు అందరి జాబితాను సిద్ధం చేసి ఏక కాలంలో దాడి చేసి అక్రమ ఫైనాన్సర్లను అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

వారి సంగతి ఏంటో..?

కరీంనగర్‌లో పోలీసులు ఈ ఒక్క దాడితోనే సరిపెడ్తారా లేక మరిన్ని దాడులకు చేస్తారా అన్న చర్చ సాగుతోంది. బడా బడా వ్యాపారులకు అప్పులు ఇచ్చే పెద్ద మనుషులపై కూడా చర్యలు తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. కరీంనగర్ పరిసరాల్లో రియాల్ భూం విపరీతంగా పెరిగిపోవడంతో కొంతమంది రియాల్టర్లు ఎంత వడ్డీ అయినా చెల్లించి అప్పులు తీసుకునేందుకు వెనకాడడం లేదు. వీరి అవసరాలు, వ్యాపారంలో వచ్చే ఆదాయాన్ని అంచనా వేసుకున్న అక్రమ ఫైనాన్షియర్లు 20 శాతం వడ్డీ కూడా వసూలు చేస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. ఇలాంటి వ్యాపారులకు వడ్డీలు ఎక్కువ ముట్టచెప్పాల్సి రావడంతో ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు భూముల ధరలను పెంచి సామాన్యుల నుండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి బడా వ్యాపారుల గురించి పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం చేరకపోవడం గమనార్హం. అలాగే కొంతమంది వ్యాపారులు అప్పుగా తక్కువ మొత్తంలో ఇచ్చి ష్యూరిటీ కింద రూ. కోట్ల విలువైన స్థిరాస్థులను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. డబ్బులు చెల్లించేందుకు వెల్లినా ఆస్థులు కాజేయాలని తప్పుడు లెక్కలు చెప్తున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ విషయంపై పోలీసులకు చెప్పుకునేందుకు వెల్తే మనీ లెండరింగ్ యాక్ట్ పై కేసులు నమోదు చేయకుండా బాధితులను ముప్పు తిప్పలు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప్రాపర్టీ సదరు వడ్డీ వ్యాపారి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉండడంతో స్థిరాస్థి తనదేనని, తనకు విక్రయించి కూడా తనకు అప్పగించడం లేదంటూ కోర్టులను, పోలీసులను ఆశ్రయిస్తున్న వారూ లేకపోలేదు. దీంతో సామాన్యుడు నెత్తినోరు బాదుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి తయారైంది. కరీంనగర్ పోలీసులు అక్రమ ఫైనాన్స్‌లపై దాడి చేసినప్పటికీ ఇలాంటి బడా దందాగాళ్లపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

డైలీ ఫైనాన్స్ దందా..

ఇక పోతే చిరు, మధ్య తరగతి వ్యాపారుల పాలిట శాపంగా తయారైంది డైలీ ఫైనాన్స్‌లే అని చెప్పాలి. రూ.10 వేలు అప్పుగా ఇస్తే అందులో రూ.1500 కట్ చేసుకుని ఇస్తారు. రోజు వంద చొప్పున వంద రోజుల పాటు చెల్లించాల్సి ఉంటుంది. ముందుగానే వడ్డీ వసూలు చేస్తూ రోజు వారిగా ఇన్ స్టాల్ మెంట్ పద్దతిలో డబ్బులు వసూలు చేసుకునే వ్యాపారులు కూడా ఉన్నారు. అలాగే చిరు వ్యాపారులకు ఉదయం రూ. 800 ఇచ్చి సాయంత్రం వెయ్యి రూపాయలు వసూలు చేసే ఘరనా వసూలు రాయుళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారిపైనా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Next Story

Most Viewed