ఊహకందని రీతిలో దోపిడీకి ప్లాన్.. సినిమాను తలపించిన బ్యాంకు లూటీ

by Disha Web Desk 2 |
ఊహకందని రీతిలో దోపిడీకి ప్లాన్.. సినిమాను తలపించిన బ్యాంకు లూటీ
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో ఘరానా మోసం జరిగింది. అంతర్గత సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అక్రమంగా రూ.1.25 కోట్లు విత్ డ్రా చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో మీడియాతో ఎస్పీ వివరాలు వెల్లడించారు. టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ విభాగంలో పనిచేస్తున్న జేటాల రమేష్ కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్(CSP) కిసాన్ క్రెడిట్ కార్డు దారులైన చిన్న సల్పలగూడ గ్రామానికి చెందిన మాడవి రాంబాయి, కోడప భీంరావ్, కోడప గంగాదేవీలతో కుమ్మక్కయ్యాడు. బ్యాంక్ అంతర్గత సాంకేతిక లోపాలను ఆసరాగా తీసుకొని ముగ్గురి కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) కార్డుల ద్వారా గతేడాది సెప్టెంబర్ 21 నుండి ఫిబ్రవరి 17 వరకు రూ.1.25,18,300 రూపాయలను మోసపూరితంగా విత్ డ్రా చేశారు. విషయం తెలిసిన బ్రాంచ్ మేనేజర్ వివేక్ ఈనెల 17న రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మెల్లగా వివరాలు రాబట్టారు.

జేటాల రమేష్ ఆరు CSP కార్డులపై లావాదేవీల కోసం రూ.60.000 విత్ డ్రా చేయాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా బయోమెట్రిక్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డుల నుంచి రోజూ లక్ష రూపాయల చొప్పున విత్ డ్రా చేశారు. ఇలా మడావి రాంబాయి కార్డు నుంచి రూ.72,78,000, కోడప భీంరావ్ కార్డు నుంచి రూ.35,00,200, కోడప గంగాదేవి కార్డు నుండి రూ.17,40,100, మొత్తం రూ.1,25,18,300 కోట్ల రూపాయలను డ్రా చేశారు. ఈ డబ్బులను విడతల వారీగా మడావి రాంబాయికు రూ.9,50,000, కోడప భీంరావ్‌కు రూ.5,80,000, కోడప గంగాదేవికి రూ.1,50,000 ఇచ్చారు. అనంతరం తన బంధువైన తిరుపతికి రూ.18,00,000, తన మూడో అన్న అయిన స్వామికి రూ.15,00,000, తన నాల్గో అన్న అయిన గంగయ్యకు రూ.4,00,000, తన రెండో అన్నకొడుకు దత్తుకు రూ.4.00.000, పెద్దన్న కొడుకు అశోక్‌కు రూ.1,60,000, గ్రామస్తుడు మడవి కిషన్‌కు రూ.40,000, కారే షేకన్నకు రూ.1,00,000, రాందాస్‌కు రూ.3,00,000, సోనాల గ్రామానికి చెందిన అక్క కొడుకైన పోతన్నకు రూ.1,50,000, మామిడికొరి గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు రూ.50,000, సంగ్వి గ్రామానికి చెందిన పరమేశ్‌కు రూ.20,000, భట్టి సవరగాం గ్రామానికి చెందిన సతీష్‌కు రూ.40,000, ఆదిలాబాద్‌‌లోని శాంతి నగర్‌కు చెందిన చిన్నయ్యకు రూ.20,000, ఆదిలాబాద్‌కు చెందిన గోపికి రూ.32,000, గ్రామానికి చెందిన రాకేశ్‌కు రూ.1,80,000 ఇచ్చినట్లు విచారణలో తేలింది.

అలాగే పంటరుణం రూ.1,36,000 ఉండగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చెల్లించినట్లు పేర్కొన్నారు. బ్యాంక్ అధికారులు ఫిబ్రవరి 18న జేటాల రమేష్ వద్ద నుండి రూ.44,83,510 రూపాయలు, బయోమెట్రిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. పూర్తి ఆధారాలతో పలువురి వద్ద నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మామిడిగూడ గ్రామంలో జేటాల రమేశ్ ఇంటి వద్ద ఉన్నాడనే సమాచారంతో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి రూ.20,000 నగదు, రూ. 4,00,000 విలువైన రెండు కెమెరాలు, రూ.80,900 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రమేష్‌‌ను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఎన్ఎస్వీ వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ బి.రఘుపతి, ఎస్ఐ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed