'నేను పూర్తిగా మంచిగైన బిడ్డా.. మీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నా'

by Disha Web Desk 2 |
నేను పూర్తిగా మంచిగైన బిడ్డా.. మీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నా
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ''బిడ్డా... నేను గుర్తు ఉన్నానా.. ఈలు దొరికినప్పుడల్లా.. మీరు వచ్చి నా నీడల ఆడుకుంటుంటే నాకు భలే సంబురం ఏసేది.. నా ఊడలు పట్టుకొని ఉయ్యాలలూగుతూ.. నా కొమ్మలపై ఎక్కుతూ అటు.. ఇటు ఆడుతూ మీరు సంతోష పడుతూ ఉంటే నేను ఎంతో ఖుషీ అయ్యేదాన్ని.. అప్పుడప్పుడు నా కొమ్మలపై రాళ్లతో మీ పేర్లు చెక్కుతుంటే.. బాధ అయినా.. భరించే దాన్ని.. అయిన మీకు ఎప్పుడు బాధవెట్టలే.. అందుకే గీ పాలమూరు అంటే నా పేరే గుర్తుకొచ్చేటట్లు చేసిండ్రు.. ఇంతకు నేనెవరో మీకు చెప్పలేదు కదూ.. అదే మీ పిల్లలమర్రిని.. ఇప్పుడైనా గుర్తుకొచ్చినానా.. ఇప్పుడున్న ఏడెనిమిదేళ్ల పిల్ల గాళ్ళకు తెలియకపోవచ్చు.. 12 ఏండ్లు దాటిన పిల్లల నుంచి.. ముసలోళ్ళ వరకు అందరికీ తెలుసు నేనంటే ఏంటో.. కానీ, కొత్త సోకుల వడి నన్ను మరిచిండ్రు.. గందుకే ఒక్కసారి నా గురించి మీకు చెప్పుకుంటున్న బిడ్డ.. నేను 750 సంవత్సరాల కిందట పుట్టిన.. మూడు ఎకరాల పొలంల నేను పెద్దగా అయిన.. గీ లోకంల పెద్దగా ఉన్న నాతోటి మర్రి చెట్లల్ల నేను ఒక దాన్ని.. నన్ను చూడ్డానికే ఈ పాలమూరు వల్లే కాదు.. దేశంలో నుంచి బస్సులు గట్టుకొని వచ్చి చూసి పోయేటోల్లు..

పొద్దుగాల వచ్చి పొద్దు ముకిన దాకా ఆడుకొని.. తిని.. పోయే టోల్లు .. నా పరపతి ఇంకా పెంచనీకే ఇక్కడ జింకల పార్కు పెట్టిండ్రు.. పాత కాలంలో ఉన్న దేవతలు, దేవుళ్ళు, రాజుల ఇగ్రహాలు పెట్టిండ్రు.. నాతోపాటు వీళ్ళందర్నీ చూసే టోళ్లు.. అంత గొప్పగా ఉంటే దాన్ని నేను.. మీకు గిట్ల కరోనా వచ్చినట్లుగా నాలుగేళ్ల కింద నాకు మాయదారి రోగం ఒచ్చింది.. నాకు కొమ్మలు విరిగిపడ్డాయి.. గంతే.. ఇగ నా పని అయిపోయింది అనుకున్న.. నాకొచ్చిన రోగం గురించి లోకమంతా తెలిసిపోయింది.. అంతే ఈ అధికారులు నన్ను బతికించాలని మిమ్మల్ని రాకుండా దూరం చేసిండ్రు.. మందులు.. ఎరువులు ఏసీ నా పానాలు కాపాడిండ్రు.. ఇప్పుడు నేను మల్ల సోర పిల్లల అయినా.. నా కొమ్మలు ఇంతకు ఇంతకు పెరిగిపోయి పచ్చగా అయినా.. మీ దెబ్బలు.. రాతలు.. లేక నా శరీరం అంతా మంచిగా అయ్యింది.. నన్ను దూరం నుంచి సూసి పోయేటట్లు చేసిండ్రు.. గందుకే మీరు మునుపటి లాగా సంతోష పర్త లేరు.. వచ్చిపోయే టోళ్లు తగ్గిండ్రు.. అందుకే ఇప్పుడు బాధపడుతుండా.. అయ్యా అధికారులు.. పెజా పెతి నిధులు నన్ను కాపాడిన మీకు శరణార్థి.. ఇప్పుడు మునుపటిలా కాకుండా నా నీడలోకి వచ్చి చూసి పోయేటట్లు జేయిండ్రి.. నన్ను సూడనికే వచ్చినోళ్ళు ఎంత బాధ పడుతున్నారో.. నేను గట్లే బాధపడుతుండా. గందుకే జర జాగ్రత్తలు తీసుకొని జనాన్ని వదులుండ్రి... నేను పూర్తిగా కోలుకున్న.. మీకేమి భయం లేదు.. మీ రాక కోసం.. మీ ఆనందం కోసం ఎదురుచూస్తూ ఉంటా. - మీ పిల్లలమర్రి


Next Story