భారీ నష్టాల్లోకి పేటీఎం.. ఆదాయంలో మాత్రం పెరుగుదల

by Disha Web |
భారీ నష్టాల్లోకి పేటీఎం.. ఆదాయంలో మాత్రం పెరుగుదల
X

ముంబై: డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ, (పేటీఎం) వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 30, 2022 త్రైమాసికంలో నికర నష్టం రూ. 644.4 కోట్లకు పెరిగిందని నివేదించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నష్టాలు రూ. 380 కోట్లుగా ఉన్నాయి. అయితే కార్యకలాపాల ద్వారా ఆదాయం 88.55 శాతం పెరిగి రూ. 1,680 కోట్లుగా ఉంది. చెల్లింపు వాల్యూమ్‌లు, సబ్‌స్క్రిప్షన్ రాబడులు, మర్చంట్ లోన్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలను వేగవంతం చేయడం ద్వారా రాబడి పెరిగినట్లు Paytm తెలిపింది. గ్రాస్‌ మర్చండైజ్‌ వ్యాల్యూ(GMV) రూ.3 లక్షలుగా ఉంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కాంట్రిబ్యూషన్ లాభం 197 శాతం పెరిగి రూ. 726 కోట్లకు చేరుకుంది. నెలవారీ లావాదేవీలు చేసే వినియోగదారుల సంఖ్య 49 శాతం పెరిగి 7.48 కోట్లకు చేరుకుంది. వ్యాపారుల సంఖ్య 49 శాతం పెరిగి 28.3 మిలియన్లుగా నమోదైంది. సౌండ్‌బాక్స్‌ల వంటి వినూత్న ఉత్పత్తులను అందించడం ద్వారా వ్యాపారాల సంఖ్యలో పెరుగుదల కనిపించింది.

Paytm ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారంలో ఆదాయం దాదాపు 61 శాతం పెరిగింది. కంపెనీ సగటు నెలవారీ లావాదేవీల వినియోగదారు (MTU) ఈ త్రైమాసికంలో 74.8 మిలియన్లుగా ఉంది. Paytm పంపిణీ చేసిన రుణాలు రూ. 632 కోట్ల నుంచి ఎనిమిది రెట్లు పెరిగి రూ. 5,554 కోట్లకు చేరుకున్నాయి. Paytm పోస్ట్ పెయిడ్, పర్సనల్ లోన్‌లు, మర్చంట్ లోన్‌ల నుండి అధిక డిమాండ్ కారణంగా వార్షికంగా రుణాల పంపిణీ రూ.24,000 కోట్లుగా ఉందని పేటీఎం పేర్కొంది.

Next Story

Most Viewed