సమస్యగా మారిన వాహనాల పార్కింగ్.. పట్టించుకోని డీ-మార్ట్ యాజమాన్యం

by Disha Web Desk 2 |
సమస్యగా మారిన వాహనాల పార్కింగ్.. పట్టించుకోని డీ-మార్ట్ యాజమాన్యం
X

దిశ, వనస్థలిపురం: హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు వాహనాల పార్కింగ్ అనేది తీవ్ర సమస్య అయింది. హోటల్, షాపింగ్ మాల్, సినిమా థియేటర్, రెస్టారెంట్లు, పార్కులు, పబ్బులు ఇలా ఎలాంటి ప్రాంతానికి వెళ్లాలన్నా వాహనాల నిలుపుదల ఓ తలనొప్పిగా మారింది. ఇక షాపింగ్ మాల్స్ విషయానికొస్తే.. రద్దీ మరీ ఎక్కువగా కనిపిస్తుంది. కారు, బైక్​ అయినా పార్క్​చేసేందుకు స్థలం లేక ఇబ్బందులు తప్పవు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ మరి.. వాణిజ్య సముదాయాల యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందా? అంటే అదీ లేదు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వనస్థలిపురం పరిధిలో షాపింగ్ మాల్స్‌తో ఇదే సమస్య నెలకొంటోంది. సరైన పార్కింగ్ లేక రోడ్లపైనే వాహనాలు నిలుపటంతో స్థానిక ప్రజలు, ఆర్టీసీ బస్సులు, అంబులెన్స్‌లకు ఆటంకం కలుగుతోంది.

అడ్డగోలు నిలుపుదల

వాణిజ్య సముదాయం అయిన వనస్థలిపురం డీ-మార్ట్ వద్ద సమస్య మరీ తీవ్రంగా కన్పిస్తోంది. షాపింగ్‌కు వచ్చే వాహనదారులు ఇష్టానుసారంగా రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. ఇక్కడికొచ్చే బండ్ల నిలుపుదలకు మార్ట్ సంస్థకు సంబంధించి ఒక సెల్లార్ మాత్రమే ఉండడంతో సమస్య తీవ్రంగా ఉంది. వారి సముదాయంలోని చిన్న సెల్లార్‌లో పార్కింగ్ చేస్తున్నారు. అందులో 50-60 కార్లు, మిగతా బైకులను పార్క్ చేస్తున్నారు. అది ఏమాత్రం సరిపోవడం లేదు. దాంతో వాహనాల అడ్డగోలు నిలుపుదలతో జాతీయ రహదారి ఒక లైను(ఎడమ వైపు వైట్ లైన్) మొత్తం వాటికే సరిపోతుంది.

నియంత్రణ ఏది..?

షాపింగ్ మాల్‌కి వచ్చే వాహనాలు సెల్లార్లో నిండిన తర్వాత.. రోడ్డుపై రద్దీని నియంత్రించడానికి మాల్‌కు సంబంధించి సెక్యూరిటీ వ్యవస్థ ఏమాత్రం సరిపోవడం లేదు. అంతేకాకుండా వారు నియంత్రించలేక పోతున్నారు. మాల్ ముందు వందల ద్విచక్రవాహనాలు, కార్లు చెట్ల కింద, రోడ్డుపై పార్క్ చేస్తున్నారు. ఇక టాక్సీలు, ఆటోలు అయితే వాటికి అడ్డు, అదుపు లేదు. సీరియల్ ప్రకారం పార్క్ చేసి రోడ్డు ఆక్రమిస్తున్నారు. పక్కనే ఉన్న క్రాంతి హిల్స్ కాలనీకి వెళ్లే దారి పూర్తిగా వాహనాలతో బ్లాక్ చేయబడుతోంది. స్థానికులు, ప్రజలకు నడవడానికి దారి లేక, వాళ్ల వాహనాలకు అడ్డుగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డీ-మార్ట్ మాల్‌కు ఫైర్ సేఫ్టీ ఉన్నప్పటికీ.. ఏదైనా అనుకోని సందర్భంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే మాల్‌లోని రెండు అంతస్తుల్లో అగ్నిమాపక సిబ్బంది తిరగడానికి లోపల అనువుగా లేదు. స్టాళ్లతో మొత్తం అదీ ఇరుకుగా ఉంది. మొదటి అంతస్తులో పాలు, పాల పదార్థాలు, కూల్ డ్రింక్స్, బిస్కెట్లు, నిత్యావసర సరుకుల స్టాల్, రెండో అంతస్తులో మెన్స్, ఉమెన్స్, కిడ్స్, ఫుట్ వేర్‌లు ఉన్నాయి. ఈ రెండూ ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటాయి. ఇక శని, ఆది, సెలవు, పర్వదినాల్లో కాలు తీసి పెట్టరాదు. అదే విధంగా మాల్ భవనం రెండు పక్కల తీరగడానికి అనువుగా ఉన్నా.. వెనకాల మాత్రం సరైన స్థలం లేదు.

పోలీసులేం చేస్తున్నారు?

వాహనదారులు హెల్మెట్ లేకుండా, సిగ్నల్ జంప్‌లు ఎప్పుడు చేస్తారా? అని ఎదురు చూసే ట్రాఫిక్ పోలీసులు మాత్రం.. షాపింగ్ మాల్ ముందు అడ్డగోలుగా వాహనాలు పార్క్ చేసినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజల ఆరోపిస్తున్నారు. సాయంత్రం ఐదు అయిందంటే కార్ల పార్కింగ్ వల్ల సరైన దారి తీసుకోలేక పోతున్నామని సుష్మా థియేటర్ ఎదురుగా ఉన్న బస్ స్టాప్ లోంచి వచ్చే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ వారు చోద్యం చూస్తున్నారు తప్ప పట్టించుకోవడం లేదని ఆగ్రహిస్తున్నారు. మాల్ యాజమాన్యంకు చలానాలు విధించి వాహనాల పార్క్ చేయకుండా చూడాలంటున్నారు.


Next Story

Most Viewed