గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రగతిభవన్‌కు పాదయాత్ర

by Disha Web |
గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రగతిభవన్‌కు పాదయాత్ర
X

దిశ, అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలోని ఒకానొక చిట్టచివర గ్రామం నుంచి నడుచుకుంటూ రాష్ట్ర రాజధానికి వెళ్లి సీఎంని కలవాలని, వారి గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్ కు పాదయాత్ర చేపట్టాలని ఆ ఊరి గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామస్తులు సీఎం కేసీఆర్ ను కలిసేందుకు హైదరాబాదుద్‌లోని ప్రగతి భవన్ కు పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. రామన్నగూడెం గ్రామపంచాయతీ పరిధిలో భూములకు తెలంగాణ డిజిటల్ పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు, అటవీ శాఖ స్వాధీనం చేసుకున్న ఆదివాసీల భూములను తిరిగి వారికి అప్పగించడం, గ్రామపంచాయతీలో చేపట్టాల్సిన పనులు.. ఇలా పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో పాదయాత్రకు శ్రీకారం చుట్టామంటున్నారు. ఈనెల 27న ఆంధ్ర -తెలంగాణ సరిహద్దు గ్రామమైన రామన్నగూడెం నుండి ప్రారంభమై హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ కు సుమారు 360 కిలోమీటర్లు మేర పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా పాదయాత్రను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అయితే తమ గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్ కు పాదయాత్రగా వెళ్తున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ కు తెలియజేసే వినతి పత్రాన్ని అందజేసేందుకు రామన్నగూడెం గ్రామస్తులంతా గురువారం జిల్లా కేంద్రం కొత్తగూడెంకు వెళ్లారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వారి కార్యాలయంలోని ఇన్ వార్డ్ విభాగంలో వినతి పత్రాన్ని సమర్పించి వెనుదిరిగారు.

టీఆర్ఎస్ జెండాలతోనే పాదయాత్ర

సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ పాదయాత్రను తలపెట్టిన వారిలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప భర్త మడకం నాగేశ్వరరావు ముఖ్య భూమిక వహిస్తున్నాడు. టీఆర్ఎస్ పార్టీ జెండాలతో పాదయాత్ర చేపట్టనున్నట్టు ఆయన తెలిపాడు. తామంతా కేసీఆర్ అభిమానులం కాబట్టి వారి పార్టీ జెండాలతో వెళితే సీఎంను కలిసేందుకు సులువు అవుతుందని మడకం నాగేశ్వరరావు తెలిపారు.

Next Story