ఆ బ్రెయిన్‌కి వేడెక్కువ‌.. మ‌గాళ్ల కంటే ఆడోళ్ల‌కే అది అధికం!

by Disha Web Desk 20 |
ఆ బ్రెయిన్‌కి వేడెక్కువ‌.. మ‌గాళ్ల కంటే ఆడోళ్ల‌కే అది అధికం!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కొంద‌రికి కోపం ఎక్కువ‌. అలాంటి వారి మెద‌డు కాస్త వేడెక్కిన‌ట్లు ఉంటుంది. కొంద‌రికి మొఖ‌మంతా ఎర్ర‌గా మారి, సెగ‌లు పుడుతున్న‌ట్లు ఉంటుంది. అయితే, ఈ 'హాట్‌హెడ్' ఉన్నోళ్ల‌కు కోపిష్టి, త‌ల పొగ‌రు వంటి ర‌క‌ర‌కాల పేర్లూ ఉంటుంటాయి. నిజానికి, మానవ మెదడు వేడి స్వభావరీత్యా 'హాట్‌హెడ్'గా ఉన్నాడా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఉంటుందని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన మానవ శరీరం సగటు ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. ఇక‌, మెదడు ఉష్ణోగ్రత కూడా శరీర ఉష్ణోగ్రతతో సమానంగా ఉంటుందని గతంలో భావించారు. కానీ ఈ ప్ర‌స్తుత‌ అధ్యయనం మరోలా చెబుతోంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆరోగ్యకరమైన మానవ మెదడు సగటు ఉష్ణోగ్రత 38.5 డిగ్రీల సెల్సియస్ అని కనుగొన్నారు. మెదడులోని కొన్ని అంతర్గత ప్రాంతాలు 40 డిగ్రీల సెల్సియస్‌లో ఉన్నట్లు కూడా నిర్థారించారు.

శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం కోసం 20-40 సంవత్సరాల మధ్య వయస్సు గల 40 మంది వాలంటీర్లను ప‌రిశీలించారు. వారి మెదడు ఉష్ణోగ్రతలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్కాన్‌ల ద్వారా సేకరించారు. జీవనశైలి, జన్యుపరమైన వ్యత్యాసాలు వంటి అంశాలు కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. ఆరోగ్యంగా ఉండే వారిలో మెదడు సగటు ఉష్ణోగ్రత 38.5 డిగ్రీల సెల్సియస్ అని కనుగొన‌గా, ఇది నాలుక కింద కొలిచిన ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీల కంటే ఎక్కువ వేడిగా ఉన్న‌ట్లు గ‌మ‌నించారు. మెదడు ఉష్ణోగ్రత రోజుని బట్టి మారుతూ ఉంటుందని కూడా అధ్యయనం తెలిపింది. ఇక మెదడు ఉన్న స్థానం, రోజులో సమయం, వయస్సు, సెక్స్, రుతు చక్రం బ‌ట్టి ప‌రిశీలిస్తే, మగవారి కంటే మహిళల్లో మెదడు ఉష్ణోగ్ర‌త‌ 0.4 డిగ్రీల సెల్సియస్ వేడిగా ఉన్నట్లు కూడా కనుగొన్నారు.


Next Story

Most Viewed