'మహానేత కేసీఆర్​ను గజ్వేల్ ​వదులుకోదు.. కాంగ్రెస్​, బీజేపీ నేతలు భ్రమలు వీడాలి..'

by Dishafeatures2 |
మహానేత కేసీఆర్​ను గజ్వేల్ ​వదులుకోదు.. కాంగ్రెస్​, బీజేపీ నేతలు భ్రమలు వీడాలి..
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: కక్షలు, కార్పణ్యాలు లేని ఆదర్శ గజ్వేల్​ ఇలాగే ఉండాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఒక్క కేసీఆర్​తోనే అది సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. గజ్వేల్​ గడ్డ, కేసీఆర్​ అడ్డా. దేశంలోనే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన మహానేత సీఎం కేసీఆర్​‌ను గజ్వేల్​ వదులుకోదని గజ్వేల్​ మార్కెట్​ కమిటీ చైర్మన్​ మాదాసు శ్రీనివాస్ ​అన్నారు. కేసీఆర్​ గజ్వేల్​ను వీడనున్నట్లు, కాంగ్రెస్​, బీజేపీ పార్టీలు నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గజ్వేల్ కేసీఆర్ అడ్డా అని, సారుకు తప్ప మరే పార్టీకి ఇక్కడ స్థానం లేదని ఆయన అన్నారు.

నియోజకవర్గాన్ని తెలంగాణ అభివృద్ధి ముఖచిత్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే స్థానిక ప్రజలు విశ్వసిస్తున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ ఇక్కడికి రాకముందు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గజ్వేల్ నేడు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవడం కేసీఆర్ చలవేనన్నారు. తెలంగాణ అభివృద్ధి చరిత్ర రాస్తే కేసీఆర్‌కు ముందు కేసీఆర్‌కు తర్వాత అని చెప్పుకునేలా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. అభివృద్ధి కేంద్రంగా నేడు గజ్వేల్ విలసిల్లుతోందని, సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేవలం భ్రమల్లోనే తమకు తాము అధికారంలోకి వస్తామని ఊహించుకుంటున్నారని శ్రీనివాస్​ ఎద్దేవా చేశారు.

వాస్తవంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గజ్వేల్​లో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. అసాధ్యమని అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇవాళ దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణనే కాదు యావత్ దేశమే కోరుకుంటున్న ఈ సందర్భంలో గజ్వేల్ గడ్డమీద ప్రతిపక్షాలు పగటి కలలు కనడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ వంటి మహానాయకుడిని ఈ నియోజకవర్గ ప్రజలు వదులుకోరని శ్రీనివాస్​ అన్నారు. గజ్వేల్ ప్రజలు కక్షలు కార్పణ్యాలు లేని అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని పునరుద్ఘాటించారు. గజ్వేల్ ప్రజలు అభివృద్ధి కేంద్రంగానే ఆలోచిస్తారని ప్రతిపక్షాల ఆరాటం అంతా డిపాజిట్లను నిలుపుకునేందుకేనని విమర్శించారు.

గజ్వేల్‌లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే టీఆర్ఎస్ పార్టీ ఒక అజేయమైన శక్తి అని, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజల కోసమే పనిచేసే కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీ రామరక్ష అని శ్రీనివాస్​ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీల ఆరాటం అంతా ఓట్లు, సీట్లు, అధికారం మీద మాత్రమే ఉందన్నారు. కేసీఆర్ మాత్రం నిరంతరం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిలో తెలంగాణను ముందుంచడంలో తలమునకలై పని చేస్తున్నారన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అమలవడం లేదని, వాళ్లకు ఈ రాష్ట్రంలో అధికార కాంక్ష తప్ప అభివృద్ధి ధ్యాస లేదన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు పగటి కలలు కనడం మానాలని, లేదంటే ప్రజా క్షేత్రంలో భంగపాటు తప్పదని శ్రీనివాస్​ హెచ్చరించారు.


Next Story