మతపరమైన లేదా ట్రస్టులకు చెందిన అద్దె గదులకు జీఎస్టీ నుంచి మినహాయింపు!

by Disha Web Desk 17 |
మతపరమైన లేదా ట్రస్టులకు చెందిన అద్దె గదులకు జీఎస్టీ నుంచి మినహాయింపు!
X

న్యూఢిల్లీ: మతపరమైన లేదా ఛారిటబుల్ ట్రస్టుల ద్వారా నిర్వహించబడే సముదాయాలకు చెందిన గదుల అద్దెపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నుంచి మినహాయింపు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రకటనలో వెల్లడించింది. గత నెలలో కేంద్రం గదుల అద్దెపై 12 శాతం జీఎస్టీ అమల్లోకి తెచ్చిన క్రమంలో దీనిపై చాలామందికి సందేహాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయానికి సమీపంలోని సత్రాల్లో అద్దె గదులపై జీఎస్టీ వసూలు చేయడం ప్రారంభించారు. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పన్ను మినహాయింపు కోరుతూ లేఖలు వచ్చాయి. దీంతో కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు(సీబీఐసీ) ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చింది.

రోజుకు రూ. వెయ్యి కంటే తక్కువ అద్దె ఉన్న హోటల్ గదులకు 12 శాతం జీఎస్టీ ఉంటుంది. అయితే, ఛారిటబుల్ లేదా మతపరమైన ట్రస్ట్ ద్వారా నిర్వహించే గదుల అద్దెపై జీఎస్టీ వర్తించదని సీబీఐసీ వెల్లడించింది. ఇలాంటి సముదాయాల్లో గదుల అద్దె సాధారణంగానే రూ. వెయ్యి కంటే తక్కువగా ఉంది. కాబట్టి మునుపటి ధోరణిలో వీటిని జీఎస్టీ నుంచి మినహాయింపు కొనసాగుతుందని వివరించింది. జూన్ 28, 2017 నాటి నోటిఫికేషన్ ప్రకారం ఈ మినహాయింపు అందుబాటులో ఉందని స్పష్టం చేసింది.



Next Story

Most Viewed