వినికిడి లోపమున్న వారికి 'ఏఆర్ గ్లాసెస్'.. సబ్‌టైటిల్స్‌గా ఆడియో

by Disha Web Desk 7 |
వినికిడి లోపమున్న వారికి ఏఆర్ గ్లాసెస్.. సబ్‌టైటిల్స్‌గా ఆడియో
X

దిశ, ఫీచర్స్ : ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది తమకు తెలియకుండానే వినికిడి లోపానికి గురవుతున్నారు. ముఖ్యంగా హై వాల్యూమ్‌తో టీవీ చూడటం, పాటలు వినడం, బిగ్గరగా మాట్లాడటం వంటివి వినికిడి లక్షణాలను పెంచుతాయి. ఇలా ఏదైనా సరే అధిక సౌండ్‌తో వింటున్నారంటే.. సకాలంలో సమస్యను గుర్తించి చికిత్స తీసుకోవాలి. వాస్తవానికి వయసు పెరిగే కొద్దీ వినికిడి శక్తి తగ్గడం సహజమే కానీ ఇప్పుడు ఏ వయసులోనైనా, వారసత్వంగానూ ఈ లోపం తలెత్తుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగానే ఒక 'ఏఆర్ గ్లాస్' మార్కెట్‌లోకి వచ్చింది. ఈ కొత్త AR అద్దాలు ఆడియోను సబ్‌టైటిల్స్‌గా మార్చడం ద్వారా బధిరులకు సంభాషణలు చూసే అవకాశం కల్పిస్తుంది.

స్కార్ఫ్ అనే ఇంగ్లాండ్‌ యువకుడు.. తన తాత(97) వినికిడి లోపం కారణంగా కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్‌కు కష్టపడటాన్ని చూసి ఈ ఏఆర్ గ్లాసెస్ రూపొందించాడు. కేవలం ఆరునెలలు ఈ ప్రాజెక్ట్‌పై పనిచేసిన స్కార్ఫ్.. అగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ తయారీదారు ఎన్‌రియల్ భాగస్వామ్యంతో XRAI గ్లాసెస్‌ ఆవిష్కరించాడు. ఇవి ప్రాసెసింగ్, గ్రాఫిక్స్ ఉత్పత్తిని నిర్వహించే మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేయబడతాయి. ఈ గ్లాసెస్‌లోని మైక్రోఫోన్ నుంచి ఆడియో ఫీడ్‌ను తీసుకుని దాన్ని ఫోన్‌కు పంపుతుంది. తర్వాత సదరు ఆడియో ఫోన్‌లో హెడ్‌లైన్స్‌గా మారి, Nreal సాఫ్ట్‌వేర్‌ సాయంతో సబ్‌టైటిల్స్‌ డివైజ్‌లో ప్రొజెక్ట్ అవుతాయి. కాగా రాయల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెఫ్ పీపుల్(RNID), డెఫ్‌కిడ్జ్ వంటి సంస్థల ద్వారా ఈ కొత్త పరికరం గేమ్ ఛేంజర్‌గా ప్రశంసలు పొందడం విశేషం.

బధిరులు, వినికిడి లోపమున్న వ్యక్తులు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకే ఈ ప్రయోగం చేశాను. టీవీ చూస్తున్నప్పుడు స్క్రోల్ అయ్యే సబ్‌టైటిల్స్ మాదిరిగా సంభాషణలను ఎందుకు మార్చలేం? అనే ఆలోచనతో ఏఆర్ గ్లాసెస్‌ రూపొందించాను. సంభాషణ డేటా క్లౌడ్‌లో కాకుండా యూజర్ల వ్యక్తిగత పరికరంలో మాత్రమే నిల్వ చేయబడుతుంది. అయితే ఇది సాధ్యమైనంత కచ్చిత వ్యాఖ్యాలతో రావాలంటే నిశ్శబ్ద వాతావరణం ఉండాలి. కానీ ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో బెటర్ వెర్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. XRAI గ్లాసెస్‌ను శుక్రవారం రోజు దాదాపు 100 మంది బీటా టెస్టర్స్‌కు అందించాం. ప్రొడక్ట్, క్వాలిటీ ఎలా ఉంది? లోపాలు ఏం ఉన్నాయి? పాజిటివ్స్, నెగెటివ్స్ ఏంటి? వంటి మరెన్నో విషయాలపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ముందుకెళ్తాం. ఇవి సెప్టెంబర్ నాటికి మార్కెట్‌లో విడుదలవుతాయని ఆశిస్తున్నాను.

- స్కార్ఫ్

Next Story

Most Viewed