యూనివర్సిటీ తరగతి గదిలో నమాజ్..

by Disha Web |
యూనివర్సిటీ తరగతి గదిలో నమాజ్..
X

భోపాల్ : హిజాబ్ వివాదం కర్ణాటక నుంచి తాజాగా మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. అక్కడి సెంట్రల్ యూనివర్శిటీలో ఓ విద్యార్థిని హిజాబ్ ధరించి తరగతి గదిలో మతపరమైన ప్రార్థనలు చేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఓ వీడియోను నెట్టింట పోస్టు చేసి అందరూ ఇదే విధానాన్ని ఫాలో అవ్వాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన పెను వివాదానికి దారితీసింది. డాక్టర్ హరిసింగ్ గౌర్ సాగర్ విశ్వవిద్యాలయ తరగతి గదిలో విద్యార్థిని నమాజ్ చేస్తున్న దృశ్యాలను హిందూ జాగరణ్ మంచ్ వారు తప్పుబట్టడంతో పాటు ఆ విద్యార్థినిపై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు యూనివర్సిటీ పేర్కొంది. మతపరమైన ఆరాధనలు ఇంట్లో నిర్వహించుకోవాలని, యూనివర్సిటీ ఉన్నది చదువు కోసమేనని వైస్ ఛాన్సలర్ నీలిమా గుప్తా స్పష్టంచేశారు. ఇక క్లాస్‌రూమ్‌లో విద్యార్థిని హిజాబ్‌లో నమాజ్ చేస్తున్న వీడియో క్లిప్‌తో తమకు ఫిర్యాదు అందిందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ సంతోష్ సహగౌరా వెల్లడించారు. ఐదుగురు సభ్యుల కమిటీ 3 రోజుల్లో నివేదికను సమర్పించనుండగా, దీని ఆధారంగా చర్యలు కఠినంగా ఉంటాయని సహగౌరా చెప్పారు. క్యాంపస్‌లో విద్యార్థులకు యూనివర్సిటీలో అధికారికంగా డ్రెస్ కోడ్ లేదనందున బేసిక్ ఎథికల్ డ్రెస్సింగ్ లో తరగతులకు హాజరు కావాలని యూనివర్సిటీ మీడియా అధికారి వివేక్ జైస్వాల్ తెలిపారు. కాగా, హిందూ జాగరణ్ మంచ్ సాగర్ యూనిట్ చీఫ్ ఉమేష్ సరాఫ్ మాట్లాడుతూ వీడియోలో కనిపిస్తున్న విద్యార్థిని చాలా కాలంగా హిజాబ్ ధరించి ఉపన్యాసాలకు హాజరవుతున్నదని ఆరోపించారు. ఇటువంటి వాటిని విద్యాసంస్థల్లో అనుమతించకూడదని తెలిపారు. కాగా, మార్చి 15న కర్ణాటక హైకోర్టు హిజాబ్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.



Next Story