నా రాజకీయ జీవితం ముగిసింది.. గల్లా అరుణ కుమారి సంచలన ప్రకటన

by Disha Web |
నా రాజకీయ జీవితం ముగిసింది.. గల్లా అరుణ కుమారి సంచలన ప్రకటన
X

దిశ, ఏపీ బ్యూరో : మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత గల్లా అరుణకుమారి రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా తన కుటుంబం మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంటుందని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని దిగువమాఘం గ్రామంలో అమరరాజా శిక్షణ నైపుణ్యాభివృద్ధి సంస్థ నూతన భవనం భూమి పూజలో అమరరాజా సంస్థల చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు, గల్లా అరుణ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితం ముగిసిందని చెప్పుకొచ్చారు. తన కుమారుడు గల్లా జయదేవ్‌ టీడీపీ నుంచి ఎంపీగా పనిచేస్తున్నందువల్ల తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి తాము పెద్ద దిక్కుకాదని, చంద్రబాబే పార్టీకి పెద్ద దిక్కని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ తనకంటూ అనుచరులు ఉన్నారని వారంతా తన వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత తరుణంలో తన అనుచరులకు స్వేచ్ఛ ఇచ్చానని, ఎక్కడ భవిష్యత్ ఉంటుందో ఆ పార్టీలోకి వెళ్లి స్వేచ్ఛగా ఉండాలని ఇప్పటికే సూచించినట్లు గల్లా అరుణ కుమారి తెలిపారు. ఇదే సందర్భంలో రాజకీయాల్లో తాను చేయని పదవీ లేదు, చూడని రాజకీయం లేదని స్పష్టం చేశారు.

అంచలంచెలుగా ఎదిగిన గల్లా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారిలో గల్లా అరుణకుమారి ఒకరు. చిత్తూరు జిల్లా అరగొండలో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె.. రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసి ఓ వెలుగువెలుగొందారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగొందిన గల్లా అరుణకుమారి రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ జీవితంలో తడబడ్డారు. కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవడంతో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దీంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరో సభ్యురాలిగా అవకాశం కల్పించారు. 2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆమె రాజకీయాలకు దూరమయ్యారు. 2019 ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి సైతం రాజీనామా చేశారు. తాజాగా తన రాజకీయ జీవితం ముగిసిందంటూ ప్రకటించేశారు.

కొడుకు కోసమే టీడీపీకి మద్దతు

దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన గల్లా అరుణకుమారి తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. తన రాజకీయ ప్రయాణం ముగిసిందని.. ఇకపై సేవా ప్రయాణం మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే తన కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారని చెప్పుకొచ్చారు. గల్లా జయదేవ్ ఎంపీగా కొనసాగుతున్న తరుణంలో తన మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంటుందని ప్రకటించారు. ఒకసారి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకోవడం, మరోసారి టీడీపీ పొలిట్ బ్యూరోకు రాజీనామా చేయడం... తాజాగా రాజకీయలకు స్వస్తి పలకడం ఇలా వరుస పరిణామాలతో టీడీపీలో గందరగోళం నెలకొంది. గల్లా జయదేవ్ ప్రకటనపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Next Story