టీఆర్‌ఎస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి సీనియర్ నాయకుడు ?

by Disha Web |
టీఆర్‌ఎస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి సీనియర్ నాయకుడు ?
X

అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎర్రగొళ్ల మురళీయాదవ్ బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారు దిగి నేరుగా ఆయన కమలం పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కొంత కాలంగా ఆయన పార్టీపై అసంతృప్తితో కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలతో దగ్గర సంబంధాలు ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్​గా ఉన్న మురళీయాదవ్​ ఒక్కసారిగా మీడియా ముందుకువచ్చి అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మీడియా సమావేశంలో ఆయన పార్టీపై, ముఖ్యమంత్రి కేసీఆర్​పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో బడుగు, బలహీన బీసీ వర్గాలకు పదవుల విషయంలో తీవ్ర అన్యాయం జరగుతున్నదని అందోళన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల వారిని తీసుకువచ్చి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో బీసీలు, అందులో ఉద్యమకారులు, పార్టీ కోసం పనిచేసిన వారే లేరా..? అని ప్రశ్నించారు. అయితే మురళీయాదవ్ బీజేపీలో చేరడానికి సిద్ధం అయిన తరువాత ఇలా మీడియా సమావేశం పెట్టినట్లు సన్నిహితులు చెబుతున్నారు. కాగా మురళీయాదవ్ పార్టీ మారితే నర్సాపూర్ నియోకవర్గంలో రాజకీయ పరిస్థితులు మారిపోనున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనున్నదని చెప్పుకోచ్చు.
దిశ ప్రతినిధి, సంగారెడ్డి : అధికార పార్టీ సీనియర్​ లీడర్​, నర్సాపూర్​ మున్సిపల్​ చైర్మన్​ ఎర్రగోళ్ల మురళీయాదవ్​ టీఆర్‌ఎస్​ను వీడనున్నారా? ఇందుకు ఆయన శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన తీరును చూస్తే తెలుస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్​ గా ఉన్న ఆయన ఒక్కసారిగా మీడియా ముందుకు రావడంతో నర్సాపూర్​ రాజకీయాలు వాడీవేడిగా మారాయి. త్వరలో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో బడుగు, బలహీన బీసీ వర్గాలకు పదవుల విషయంలో తీవ్ర అన్యాయం జరగుతున్నదని విమర్శించారు. ఇతర పార్టీల వారిని తీసుకువచ్చి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో బీసీలు, అందులో ఉద్యమకారులు, పార్టీ కోసం పనిచేసిన వారే లేరా..? అని ప్రశ్నించారు. తమ భాదలు ఎవరికీ చెప్పుకునే పరిస్థితి లేదని, తనపై పార్టీ ఏ చర్యలు తీసుకుంటుందో చూస్తా. ఆ తరువాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు.

కండక్టర్ నుంచి రాజకీయాల్లో..

ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేసే మురళీయాదవ్ 1995లో తన జాబ్ కు రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. నర్సాపూర్ సీపీఐ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి శిశ్యుడిగా ఉండేవారు. ఆ తరువాత నర్సాపూర్ సర్పంచ్ గా ఎన్నికల్లో గెలుపొందారు. తాను రెండు సార్లు, మురళీయాదవ్ సతీమణి రాజమణి ఐదేళ్లు సర్పంచ్ గా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. ఆతరువాత జెడ్పీటీసీగా గెలుపొందిన రాజమణి ఉమ్మడి మెదక్ జిల్లా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అయ్యారు. పదవికి కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా మురళీయాదవ్ టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మొదటి నుంచి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. సుదీర్ఘకాలం నర్సాపూర్ సర్పంచ్ గా దంపతులిద్దరు పనిచేయడం, ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గా మురళీయాదవ్ కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లిన మురళన్న వచ్చిండని ఆప్యాయంగా పలకరిస్తుంటారు.

సునీతాలక్ష్మారెడ్డి రాకతో మారిన రాజకీయ పరిస్థితులు..

నర్సాపూర్ ఎమ్మెల్యేగా రెండవ సారి చిలుముల మధన్ రెడ్డి కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు సార్లు మదన్ రెడ్డి గెలిపించడంలో మురలీయాదవ్ పాత్ర ఉన్నదని చెప్పుకోవచ్చు. మదన్ రెడ్డి, మురళీయాదవ్ ల మద్య కూడా ఎప్పుడూ రాజకీయంగా మనస్పర్థలు రాలేదు. ఎమ్మెల్యేను పెద్దాయన మురళీయాదవ్ గౌరవిస్తారు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరిందో అప్పటి నుంచి నర్సాపూర్ లో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. పార్టీలోకి వచ్చిన సునీతారెడ్డికి మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. పార్టీలోకి వచ్చిరాగానే క్యాబినెట్ హోదాతో పదవి ఇవ్వడాన్ని మురళీ యాదవ్ తో పాటు పార్టీ శ్రేణులు కూడా వ్యతిరేకించారు. ఉద్యమ సమయంలో మంత్రిగా ఉన్న సునీతారెడ్డి తమపై కేసులు పెట్టించి ఎన్నో ఇబ్బందులు పెట్టిందని, అలాంటి వారిని అందలం ఎక్కించడాన్ని జీర్ణించుకోలేదు. మొదటి నుంచి పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన వారిని, పట్టించుకోకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై మురళ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. కాగా గత కొద్ది రోజులుగా నర్సాపూర్ లో పార్టీ పరంగా కూడా సునీతారెడ్డికి అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా జీర్ణించుంచుకోలేదు.

వచ్చే ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి సునీతారెడ్డి..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సునీతారెడ్డి అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీలో విస్త్రతంగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డి వయసు మీదపడడం, ఆరోగ్యం సహకరించపోవడంతో సునీతారెడ్డి కే టికెట్ ఇవ్వనున్నట్లు అమె సన్నిహితులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల మోకాలి ఆపరేషన్ చేయించుకుని వచ్చిన తరువాత ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా ఉత్సాహంగానే నియోకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే ఆయనకు మూడోసారి అవకాశం ఇచ్చే ప్రసక్తేలేదని సునీతారెడ్డికి అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు పనిచేసుకోవాలని సూచించినట్లు కూడా ప్రచారం జరుగుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మురళీ యాదవ్ మనసు మార్చుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రెండు సార్లు మదన్ రెడ్డిని గెలిపించాం. ఇక ఇప్పుడు సునీతారెడ్డిని గెలిపించాలా..? అంటూ మురళీయాదవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

త్వరలో బీజేపీలోకి..

మురళీయాదవ్ త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సంగారెడ్డిలో మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టిన ఆయన పార్టీ మారున్నట్లు మాత్రం చెప్పలేదు. పార్టీలోనే ఉన్నానని బీసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అయితే జిల్లా మంత్రి హరీశ్​ రావును మాత్రం కొనియాడారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే మంత్రి హరీశ్​ రావు వద్ద చాలా కాలంగా పనిచేయడంతో సన్నిహితుడనే ముద్రపడింది కూడా. ఈ కారణంగా కూడా మంచి పదవులు రాకుండా పోయాయని మురళీ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తీరును మాత్రం తూర్పార పట్టారు. తమ బాధలు ఎవరితో చెప్పుకోవాలి..? ప్రగతి భవన్ లోకి వెళ్లే అవకాశమే లేదన్నారు. అయితే ఇలా టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం వెనక బీజేపీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ సస్పెండ్ చేస్తే మురళీ యాదవ్ ఆ వెంటనే బీజేపీ పార్టీలో చేరిపోతారని సన్నిహితులు చెబుతున్నారు.

టీఆర్ఎస్ కు భారీ షాక్..

మురళీయాదవ్ బీజేపీలో చేరితో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనున్నది. సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన వారు కాగా, మదన్ రెడ్డి వయసుమీద పడడంతో టికెట్ రాదనే ఆ పార్టీ వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారు. ఆ క్రమంలో మొదటి నుంచి స్థానికంగా ఉంటూ ఉద్యమంలో పాల్గొన్న మురళీయాదవ్ బీజేపీకి వెళితే టీఆర్ఎస్ కు షాక్ తప్పదని పరిస్థితులు స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గంలోని హత్నూరకు చెందిన ఉమ్మనగారి దేవేందర్ రెడ్డికి లేబర్ వెల్ఫేర్​ చైర్మన్ పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన దేవేందర్ రెడ్డికి కార్పొరేషన్ ఇచ్చి కాంగ్రెస్ నుంచి వచ్చిన సునీతారెడ్డికి క్యాబినెట్ హోదా పదవి ఇవ్వడాన్ని ఆయన కూడా వ్యతిరేకిస్తున్నారు. దేవేందర్ రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం లేదు. ఈ క్రమంలో మురళీయాదవ్ వెళ్లిపోతే టీఆర్ఎస్ నుంచి చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఆయనతో పోయే అవకాశాలున్నాయని స్థానిక రాజకీయ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed