కథలు చెప్పొద్దు.. డబ్బులు ఇవ్వాల్సిందే.. సంచలనం రేపుతోన్న ఎంపీడీఓ ఆడియో లీక్

by Disha Web Desk 12 |
కథలు చెప్పొద్దు.. డబ్బులు ఇవ్వాల్సిందే.. సంచలనం రేపుతోన్న ఎంపీడీఓ ఆడియో లీక్
X

దిశ, చెన్నారావుపేట: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లో పంచాయతీ కార్యదర్శులను అక్కడి ఎంపీడీఓ వేధిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్ లలో హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. చెన్నారావుపేట మండల ఎంపీడీవో గా లలిత విధులు నిర్వహిస్తోంది. గత కొంత కాలంగా లలిత మండలంలోని పలువురు కార్యదర్శిలను డబ్బులు ఇవ్వాలని పలు కారణాలు చూపెడ్తూ.. ఇబ్బందులకు గురి చేస్తోంది. డబ్బులు ఇవ్వని జేపీఎస్‌లను చిన్న చిన్న కారణాలు చూపుతూ బదిలీలు చేస్తోంది. ఎందుకు బదిలీ చేశారో తెలియక మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. చిన్న, పెద్ద గ్రామపంచాయతీలు అన్న బేధం లేకుండా జూనియర్, సీనియర్ అనే తారతమ్యం లేకుండా నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలు బదిలీలకు తెరలేపింది. డబ్బులు ఇస్తే ఒకలాగా, లేదంటే మరోలా కార్యదర్శులను ఇష్టారీతిగా బదిలీ చేస్తూ మండల వ్యాప్తంగా ఉన్న కార్యదర్శులలో అభద్రతను నెలకొల్పింది.

మ్యూచువల్ గా జరగాల్సిన అంతర్గత బదిలీలను సైతం ఒకవైపు అనుకూలంగా ఉంటే చాలు చేసేస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత గ్రామ పంచాయతీ సర్పంచులు ఈ విషయమై కొన్ని రోజుల కిందట ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన జిల్లా స్థాయి అధికారులు అసలు నిగ్గు తేల్చారు. ఎంపీడీఓ లలితను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. చెన్నారావుపేట మండలంలోని ఓ జూనియర్ పంచాయతీ కార్యదర్శితో ఎంపీడీఓ లలిత జరిపిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎంపీడీఓ వైఖరి పట్ల మండల ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. మంచి హోదాలో ఉన్న వ్యక్తులు ఇలా అనుచితంగా ప్రవర్తించడం పట్ల మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Next Story