వైసీపీకి బిగ్ షాక్.. పొత్తు కుదిరితే బలమైన నేత గుడ్ బై..!

by Disha Web Desk 1 |
వైసీపీకి బిగ్ షాక్.. పొత్తు కుదిరితే బలమైన నేత గుడ్ బై..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మంత్రివర్గ విస్తరణపై ఆసక్తికర చర్చ నెలకొన్నవేళ ఓ బలమైన నేత అధికార పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారనే చర్చ ఊపందుకుంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ రెండు పార్టీల్లో తన హవా చెలాయించారు ఆ నేత. ఇప్పుడు అదే నేతకు వైసీపీలో తగిన గౌరవం దక్కట్లేదనే ఆవేదన వేధిస్తోందట. అందుకే పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే ఓ మెలిక ఉంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితేనే బిచాణా ఎత్తేద్దామని చూస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఎందుకు అసంతృప్తితో రగిలిపోతున్నారు? ఏ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరాలి అని చూస్తున్నారు? ఈ ప్రశ్నలకి జవాబులు తెలియాలంటే పూర్తిగా చదవాల్సిందే.

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. ఆయనో సీనియర్ నేత. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుండి 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1998, 2004, 2009 లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరిన ఆయన 2014లో ఒంగోలు నుండి ఎంపీగా పోటీ చేసి వైవీ సుబ్బారెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరపున టీడీపీ నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల ముందు మాగుంట కు టీడీపీ అధిష్టానంతో విబేధాలు తలెత్తాయి. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కేటాయించడంలో ఆయన నిర్ణయంతో అధిష్టానం విభేదించింది. దీంతో ఫైర్ అయిన మాగుంట టీడీపీకి గుడ్ బై చెప్పి, ఆయన రాక కోసం అప్పటికే బ్లూ కార్పెట్ వేసిన వైసీపీలోకి జంప్ అయ్యారు.

వైసీపీ నుండే అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో మరోసారి ఒంగోలు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి తన సత్తా చాటుకున్నారు. కానీ, ఓ సీనియర్ నేతగా, జిల్లాలో బలమైన నేతగా పేరొందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి పార్టీలో తగినంత ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన వర్గం వాదన. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి, మాగుంట శ్రీనివాసులు రెడ్డికి విభేదాలున్నాయి. సీఎం జగన్ తో మంత్రి బాలినేనికి సత్సంబంధాలున్నాయి. దీంతో ఈసారి ఒంగోలు ఎంపీ టికెట్ దక్కుతుందో లేదో అనే సందేహంలో ఉన్నారు మాగుంట. అంతేకాదు, తన కొడుకు మాగుంట రాఘవ రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలి అనుకుంటున్నారు ఈ నేత. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దింపాలి అని చూస్తున్నారు.

వైసీపీలో తండ్రికొడుకులిద్దరి టికెట్లపైన సందిగ్ధం నెలకొనడంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. పార్టీ మారితే తిరిగి టీడీపీ గూటికే చేరాలి అని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ టీడీపీ ఒంటరి పోరాటం చేస్తే ఈసారి కూడా గెలవడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో టీడీపీ-బీజేపీ లేదా టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే టీడీపీలో చేరేందుకు రంగం పావులు కడుపుతున్నారట మాగుంట. పొత్తు లేని పక్షంలో వైసీపీలోనే కొనసాగుతూ ఎలాగైనా కొడుకుకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నించనున్నారని సన్నిహితుల సమాచారం.

Next Story

Most Viewed