- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాడి రైతుల రాస్తారోకో.. బకాయిల చెల్లింపు పై మదర్ డైరీ హామీ
పాడి రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా బాలాజీనగర్‌లోని కోదాడ–హుజూర్‌నగర్ ప్రధాన రహదారి పై మంగళవారం పాడి రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు.

దిశ, కోదాడ : పాడి రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా బాలాజీనగర్‌లోని కోదాడ–హుజూర్‌నగర్ ప్రధాన రహదారి పై మంగళవారం పాడి రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు. మదర్ డైరీ పరిధిలో పనిచేస్తున్న ఏడు పాల సేకరణ సంఘాలకు సంబంధించిన సుమారు రూ.17 లక్షల బకాయిలు ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెలల తరబడి తమకు రావాల్సిన పాల బిల్లులు చెల్లించకుండా మదర్ డైరీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం అన్యాయమని విమర్శించారు. పాడిపరిశ్రమ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ యాజమాన్యం సమస్యను పట్టించుకోలేదని ఆరోపించారు. రాస్తారోకో కారణంగా కోదాడ–హుజూర్‌నగర్ రహదారి పై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. అనంతరం ఢిల్లీ నేషనల్ డైరీ సీఈఓ లింగారెడ్డి ఆందోళన చేస్తున్న రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న రూ.17 లక్షల బకాయిలను రెండు వారాల్లో పూర్తిగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే రైతులకు సంబంధించిన ఇతర ఆర్థిక అంశాలను కూడా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. దీంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. అయితే బకాయిల చెల్లింపుతో పాటు పశువుల మేత, దాణా కొనుగోళ్ల కోసం ముందస్తు ఖర్చులను కూడా విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నిర్ణీత గడువులోగా అమలు చేయకపోతే మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు పాల సేకరణ సంఘాల ప్రతినిధులు, పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






